Super rich: సంపన్న వర్గాల పెట్టుబడుల్లో 17 శాతం లగ్జరీ వస్తువులపైనే

Super rich investments: అధిక సంపన్న వర్గాలకు చెందినవారు తమ పెట్టుబడులను లగ్జరీ ఐటెమ్స్‌ పైనే పెడుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది.

Updated : 28 Feb 2024 17:54 IST

దిల్లీ: సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య ఆదాయవర్గాల వారు బంగారం, స్థిరాస్తి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. అత్యధిక సంపన్నులు మాత్రం అందుకు భిన్నం. తమవద్ద పెట్టుబడి పెట్టదగ్గ సంపదలో 17 శాతం లగ్జరీ వస్తువుల పైనే వెచ్చిస్తున్నారట. ముఖ్యంగా వాచ్‌లు, కళాఖండాలు, ఆభరణాలపై ఖర్చు చేస్తున్నారని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ వెల్లడించింది. ఈమేరకు ‘ది వెల్త్‌ రిపోర్ట్‌ 2024’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.

30 మిలియన్‌ డాలర్లు, అంతకంటే ఎక్కువ సంపద కలిగిన వారిని అధిక సంపన్న వర్గాలకు చెందినవారిగా నైట్‌ ఫ్రాంక్‌ వర్గీకరించింది. లగ్జరీ వస్తువులపై పెట్టుబడి పెట్టడానికి భారత్‌కు చెందిన అధిక సంపన్న వ్యక్తులు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో లగ్జరీ వాచ్‌లు తొలి స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానంలో కళాఖండాలు, ఆభరణాలు ఉన్నాయి. క్లాసిక్‌ కార్లు, లగ్జరీ హ్యాండ్‌బాగ్‌లు, వైన్‌, అరుదుగా లభించే విస్కీ, ఫర్నీచర్‌, రంగురంగుల వజ్రాలు, కాయిన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్‌ను పరిశీలించినప్పుడు లగ్జరీ వాచ్‌లు తొలిస్థానంలో ఉండగా.. క్లాసిక్‌ కార్లు రెండో స్థానంలో ఉన్నాయి.

యాపిల్‌ కార్లు లేనట్లే.. కీలక ప్రాజెక్టును పక్కనపెట్టిన టెక్‌ కంపెనీ

దేశంలో అధిక సంపద కలిగిన వ్యక్తులు వివిధ కేటగిరీలకు చెందిన లగ్జరీ వస్తువులను దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బాలాజీ పేర్కొన్నారు. ఈతరహా పెట్టుబడులు అధిక రిటర్నులు ఇస్తుండడంతో భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు వీటిపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. దేశీయ సంపన్నులు మాత్రం తమ అభిరుచులకు అనుగుణంగా పెట్టుబడులు కొనసాగిస్తున్నారన్నారు. భవిష్యత్‌లో ఈ తరహా పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 2023లో కళాఖండాల్లో పెట్టుబడులు 11 శాతం రిటర్నులు ఇవ్వగా.. 10ఏళ్ల కాలానికి అరుదుగా లభించే విస్కీ దాదాపు 280 శాతం రిటర్నులు ఇచ్చిందని నైట్‌ ఫ్రాంక్‌ లగ్జరీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇండెక్స్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు