Infinix Smart 8 HD: ‘మ్యాజిక్‌ రింగ్‌’తో ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 హెచ్‌డీ ఫోన్‌.. ధర, ఫీచర్లివే!

Infinix Smart 8 HD: స్మార్ట్‌ 7 హెచ్‌డీకి కొనసాగింపుగా స్మార్ట్‌ 8 హెచ్‌డీ ఫోన్‌ను ఇన్ఫీనిక్స్‌ శుక్రవారం భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం!

Published : 08 Dec 2023 17:32 IST

Infinix Smart 8 HD | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 హెచ్‌డీ (Infinix Smart 8 HD) ఫోన్‌ భారత్‌లో శుక్రవారం విడుదలైంది. స్మార్ట్‌ 7 హెచ్‌డీకి కొనసాగింపుగా కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. బడ్జెట్‌ ధరలో వస్తున్న ఈ ఫోన్‌ మూడు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. పిల్‌ ఆకారంలో ఉండే మ్యాజిక్‌ రింగ్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకత.

ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 హెచ్‌డీ ఫోన్‌ భారత్‌లో 3GB ర్యామ్‌ + 64GB స్టోరేజ్‌ వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర (Infinix Smart 8 HD Price) అమెజాన్‌లో రూ.7,990గా ఉంది. వివిధ బ్యాంకుల క్రెడిట్‌ కార్డులతో గరిష్ఠంగా రూ.1,500 వరకు రాయితీ లభిస్తోంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ రాయితీతో కలుపుకొని ఫోన్‌ ధర రూ.5,669 మాత్రమేనని సైట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 7 హెచ్‌డీ 2GB + 64GB వేరియంట్‌.. రూ.5,999 ధర వద్ద మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఎక్స్‌ఓఎస్‌ 13తో ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 హెచ్‌డీ (Infinix Smart 8 HD Specifications) వస్తోంది. 90Hz రీఫ్రెష్‌ రేటు ఉన్న 6.6 అంగుళాల హెచ్‌డీ+ తెరను అమర్చారు. ఈ ఫోన్‌లో కంపెనీ మ్యాజిక్‌ రింగ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో తెర పైభాగంలో ఉండే నాచ్‌ చుట్టూ పిల్‌ ఆకారంలో ఛార్జింగ్‌ యానిమేషన్స్‌, బ్యాగ్రౌండ్‌ కాల్స్‌లో బ్యాటరీ రిమైండర్లు సహా ఇతరత్రా నోటిఫికేషన్లు కనిపిస్తాయి. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్‌ యూనిసాక్‌ టీ606 ప్రాసెసర్‌ను అమర్చారు. 3జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా 6జీబీ వరకు విస్తరించుకోవచ్చు. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా స్టోరేజ్‌ను 2టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 హెచ్‌డీ (Infinix Smart 8 HD) ఫోన్‌ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్‌ కెమెరాను పొందుపర్చారు. బ్లూటూత్‌, వైఫై, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. బయోమెట్రిక్‌ అన్‌లాక్‌ కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను ఇచ్చారు. ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ కూడా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని