Google Play Store: గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి.. నౌకరీ, 99 ఏకర్స్‌ మాయం..

Google Play Store: గూగుల్‌ ప్లే స్టోర్‌ మరిన్ని యాప్‌లను తొలగించింది. నౌకరీ, శిక్షా, 99 ఏకర్స్‌ వంటి యాప్‌లు ప్రస్తుతం అందులో కన్పించడం లేదని ఇన్ఫోఎడ్జ్ కంపెనీ వెల్లడించింది.

Updated : 02 Mar 2024 18:48 IST

దిల్లీ: సర్వీసు ఫీజు చెల్లింపులపై వివాదం తలెత్తిన నేపథ్యంలో, భారత్‌లోని తన ప్లే స్టోర్‌ (Google Play Store) నుంచి కొన్ని యాప్‌లను గూగుల్ తొలగిస్తోంది. ఈ క్రమంలోనే తమ సంస్థకు చెందిన నౌకరీ (Naukri), నౌకరీ రిక్రూటర్‌, నౌకరీగల్ఫ్‌, 99ఏకర్స్‌ (99 acres), శిక్షా మొబైల్ అప్లికేషన్లను గూగుల్ డీలిస్ట్‌ చేసినట్లు ఇన్ఫోఎడ్జ్‌ (ఇండియా) లిమిటెడ్‌ శనివారం వెల్లడించింది.

‘‘ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే గూగుల్ మా కంపెనీ యాప్‌లను ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. మాతో పాటు ఇతర సంస్థల మొబైల్ అప్లికేషన్లు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే మా యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్న యూజర్లు యథావిధిగా వాటిని వినియోగించుకోవచ్చు. ఇతర యాప్‌ స్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న వారికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. తదుపరి కార్యాచరణపై మేం చర్చలు ప్రారంభించాం. వీలైనంత త్వరగా గూగుల్‌ ప్లే స్టోర్‌లో మా యాప్‌లను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటాం’’ అని బీఎస్‌ఈ ఫైలింగ్‌ సందర్భంగా ఇన్ఫోఎడ్జ్‌ (Info Edge) వెల్లడించింది.

ప్లేస్టోర్‌లో యాప్‌ల తొలగింపు షురూ

15-30 శాతంగా ఉన్న ఛార్జీల వ్యవస్థను తొలగించాలని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఆదేశాలు జారీ చేయడంతో గూగుల్‌ ప్రస్తుతం 11-26% ఫీజును వసూలు చేస్తోంది. వీటిపై సుప్రీం కోర్టు ఎటువంటి ఊరట ఇవ్వకపోయినా.. కొన్ని సంస్థలు ఫీజులు చెల్లించడం లేదని  గూగుల్‌ పేర్కొంది. ఈ మేరకు 10 కంపెనీలపై చర్యలు చేపట్టింది. వాటి మొబైల్‌ యాప్‌లను ప్లే స్టోర్‌ నుంచి తొలగిస్తోంది.

సుప్రీం కోర్టులో గూగుల్‌ ప్లే స్టోర్‌ విధానాలను సవాలు చేస్తున్న సంస్థల్లో మాట్రిమోనీ.కామ్‌, షాదీ.కామ్‌, ఇన్ఫోఎడ్జ్‌, అన్‌అకాడమీ, ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్‌, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్‌, స్టేజ్‌, కుటుంబ్‌, టెస్ట్‌బుక్‌ తదితర కంపెనీలు ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని