RBI: అధిక వడ్డీ రేట్లు.. ఇంకెంతకాలమో చెప్పలేం: శక్తికాంత దాస్

Shaktikanta Das on Interest rate: వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత  దాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గరిష్ఠ స్థాయికి చేరిన వడ్డీ రేట్లు ఇంకెంత కాలం కొనసాగుతాయో అప్పుడే చెప్పలేమని అన్నారు.

Updated : 20 Oct 2023 13:50 IST

Shaktikanta Das | దిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తీసుకున్న కఠిన మానిటరీ పాలసీ నిర్ణయాల మూలంగా వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయికి చేరాయి. అయితే, ఇవి ఎంత కాలం ఉంటాయనే దానిపై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ (Shaktikanta Das) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికైతే వడ్డీ రేట్లు ఇదే స్థాయిలో ఉంటాయని, ఇంకెంతకాలం అదే స్థాయిలో కొనసాగుతాయన్న దానికి కాలమే సమాధానం చెప్పాలని ఆర్‌బీఐ గవర్నర్ అన్నారు. దిల్లీలో జరిగిన ఓ సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడారు.

ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు పెంచాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు తోడవ్వడంతో మరింత దూకుడుగా ముందుకెళ్లాయి. ఈ క్రమంలో ఆర్‌బీఐ సైతం 2022 మే నుంచి దాదాపు 250 బేసిస్ పాయింట్ల మేర రెపోరేటును పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మాత్రం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయనప్పటికీ.. ఇప్పటికే రెపో రేటు 6.50 శాతానికి చేరింది. అయితే, ఈ రేట్లు ఎంతకాలం స్థిరంగా ఉంటాయో అప్పుడే చెప్పలేమని, కాలమే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని శక్తికాంత దాస్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఒకే యాప్‌లో రెండు వాట్సప్‌ ఖాతాలు.. ఎలా క్రియేట్‌ చేయాలంటే..!

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ.. ద్రవ్యోల్బణం, వృద్ధి నెమ్మదించడం, ఆర్థిక అస్థిరత వంటి పలు సవాళ్లను ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. క్రూడాయిల్‌ ధర పెరుగుదల, బాండ్ల రాబడి పెరగడం వంటి తాజా సవాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్నాయని చెప్పారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా బ్యాంకులు కనీస మూలధన అవసరాలను తీర్చగలవన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఇక రూ.2వేల నోట్లకు సంబంధించి మాట్లాడుతూ.. ఇంకా రూ.10వేల కోట్ల విలువైన నోట్లు వెనక్కి రావాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని