WhatsApp: ఒకే యాప్‌లో రెండు వాట్సప్‌ ఖాతాలు.. ఎలా క్రియేట్‌ చేయాలంటే..!

WhatsApp: ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులకు వాట్సప్‌ శుభవార్త చెప్పింది. త్వరలో ఒకే యాప్‌లో రెండు వాట్సప్‌ ఖాతాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది.

Updated : 20 Oct 2023 10:58 IST

దిల్లీ: ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులకు వాట్సప్‌ శుభవార్త చెప్పింది. త్వరలో ఒకే యాప్‌లో రెండు వాట్సప్‌ ఖాతాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. అదీ లాగౌట్‌ కాకుండానే. ప్రస్తుతం దాదాపుగా అన్ని ఫోన్లు రెండు సిమ్‌లతో వస్తున్నాయి. అధికారిక, వ్యక్తిగత నంబర్లను చాలా మంది వాడుతున్నారు. ఇప్పటిదాకా ఒక నంబరుతోనే వాట్సప్‌ వినియోగించుకునే అవకాశముంది. రెండో నంబరును వాడాలంటే మొదటి నంబరు నుంచి లాగౌట్‌ అయి వినియోగించుకోవాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే ఫీచర్‌తో రెండు నంబర్లను ఉపయోగించుకుని రెండు ఖాతాలను నిర్వహించుకోవచ్చు. ఈ విషయాన్ని గురువారం మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. మరికొన్ని రోజులు లేదా వారాల్లో ఈ కొత్త ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రానుంది.

ఇప్పటి వరకు ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్‌ ఖాతాలు నిర్వహించాలంటే క్లోన్‌ యాప్‌లు లేదా ఫేక్‌ యాప్‌లు వాడాల్సి వచ్చేది. ఇకనుంచి ఆ అవసరం లేదు. వాట్సాప్‌ అధికారికంగా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చిన నేపథ్యంలో ఒకే ఫోన్‌లో, అదీ ఒకే యాప్‌లో రెండు ఖాతాలను నిర్వహించుకోవచ్చు. అయితే, సిమ్‌లు మాత్రం కచ్చితంగా రెండు ఉండాలి. అంటే ఫోన్‌ కూడా డ్యుయల్‌ సిమ్‌ సపోర్ట్‌ చేస్తుండాలి. సాధారణంగా చాలా మంది ఈ మధ్య కాలంలో వ్యక్తిగత అవసరాల కోసం ఒక వాట్సాప్‌ను, ప్రొఫెషనల్‌, బిజినెస్‌ పనుల కోసం మరో వాట్సాప్‌ను వాడుతున్నారు. అలాంటి వారు ఇప్పటి వరకు రెండు ఫోన్‌లను ఉపయోగించడమో లేదా క్లోన్‌ యాప్‌ వాడడమో చేసేవారు. ఇకపై ఆ అవసరం ఉండదు. వాట్సాప్‌ అధికారిక యాప్‌లోనే రెండు ఖాతాలను నిశ్చింతగా వాడుకోవచ్చు.

ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వాబీటాలో గత జూన్‌లోనే దీనికి సంబంధించిన సమాచారం వచ్చింది. ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగా పరీక్షించిన వాట్సాప్‌ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

రెండు ఖాతాలను ఎలా క్రియేట్‌ చేయాలి?

  • వాట్సాప్‌ ఓపెన్‌ చేసి కుడివైపు పై భాగంలో ఉండే మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి.
  • సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేసి అకౌంట్‌ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
  • యాడ్‌ అకౌంట్‌పై క్లిక్‌ చేసి ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అవ్వాలి.
  • రెండో ఖాతా అందుబాటులోకి వచ్చేస్తుంది. పైన ఉండే మూడు చుక్కలపై క్లిక్‌ చేసి కావాల్సినప్పుడు రెండు ఖాతాల మధ్య స్విచ్‌ కావచ్చు.   
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని