Tata iPhones: ఇక టాటా వారి ఐఫోన్స్‌.. విదేశాలకూ ఎగుమతి

ఇక.. మేడ్‌ ఇన్‌ ఇండియా ఐఫోన్‌ను టాటా గ్రూప్‌ తయారుచేయనుంది. ఈ ఫోన్లను తయారుచేసే తొలి భారత కంపెనీగా టాటా సంస్థ అరుదైన ఘనత దక్కించుకుంది.

Published : 27 Oct 2023 17:41 IST

దిల్లీ: భారత్‌లో ఐఫోన్‌ (iPhones)ల తయారీ టాటా గ్రూప్‌ (Tata Group) చేతికొచ్చింది. మరో రెండున్నరేళ్లలో టాటాలు తయారు చేసే ఐఫోన్లను దేశ, విదేశాల్లో విక్రయించనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఐఫోన్ల తయారీ (iPhone making) కోసం తైవాన్‌ సంస్థ విస్ట్రాన్‌ (Wistron)కు చెందిన కర్ణాటక ప్లాంట్‌ను టాటా గ్రూప్‌ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీంతో ఐఫోన్లను తయారుచేసే తొలి భారత కంపెనీగా టాటా గ్రూప్‌ అవతరించింది.

‘‘పీఎల్ఐ ప్రోత్సాహక పథకంతో భారత్‌ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ తయారీ, ఎగుమతులకు నమ్మకమైన, ప్రధాన హబ్‌గా మారుతోంది. ఇక, రానున్న రెండున్నరేళ్లలో దేశీయ, ప్రపంచ మార్కెట్ కోసం టాటా గ్రూప్‌ (Tata Group) భారత్‌లో ఐఫోన్‌ తయారీని ప్రారంభించనుంది. విస్ట్రాన్‌ ఆపరేషన్స్‌ను కొనుగోలు చేసిన టాటా సంస్థకు అభినందనలు’’ అని రాజీవ్‌ చంద్రశేఖర్‌ తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించారు.

9AM నుంచి 9PM.. వారానికి 100 గంటలు.. పని గంటలపై బాస్‌ల మాట!

ప్రస్తుతం విస్ట్రాన్‌ కార్ప్‌ దేశీయంగా కర్ణాటకలో ఐఫోన్లను తయారు చేస్తోంది. ఐఫోన్ల తయారీలోకి అడుగుపెట్టాలని నిర్ణయించిన టాటా గ్రూప్‌.. విస్ట్రన్‌ కార్ప్‌తో ఏడాదిగా చర్చలు జరిపింది. తొలుత జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. తర్వాత కొనుగోలుకే టాటా కంపెనీ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జరిగిన విస్ట్రాన్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో.. టాటా కొనుగోలు ఆఫర్‌కు ఆమోదం లభించింది. కర్ణాటకలోని విస్ట్రాన్‌ ప్లాంట్‌లో 100శాతం వాటాలను టాటా ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదిరిందని విస్ట్రాన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. 125 మిలియన్‌ డాలర్లకు ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.

ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో ఐఫోన్‌ 14 మోడల్‌ అసెంబ్లింగ్‌ను చేపడుతున్నారు. సుమారు 10 వేల మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలతో ఐఫోన్ల తయారీని పెంచుకుంటూ వచ్చిన విస్ట్రాన్‌ కార్ప్‌.. 2024 మార్చి నాటికి 1.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్లను సరఫరా చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది కల్లా శ్రామిక శక్తిని సైతం మూడింతలు చేయాలని విస్ట్రాన్‌ కార్పొరేషన్‌ పేర్కొంది. ఈ కొనుగోలుతో భారత్‌ నుంచి విస్ట్రాన్‌ నిష్క్రమిస్తే.. అనంతరం ఈ హామీలను టాటా గ్రూప్‌ కొనసాగించనుందని సంబంధిత వర్గాల సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని