9AM నుంచి 9PM.. వారానికి 100 గంటలు.. పని గంటలపై బాస్‌ల మాట!

CEOs on Working hours: వారానికి 70 గంటల చొప్పున యువత పనిచేయాలంటూ నారాయణమూర్తి వ్యక్తంచేసిన అభిప్రాయంపై చర్చ ప్రారంభమైంది. దీంతో గతంలో పని గంటల గురించి పలువురు బాస్‌లు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..

Updated : 27 Oct 2023 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ దేశాలతో మనం పోటీ పడాలంటే యువతరం వారానికి 70 గంటల చొప్పున పనిచేయాలంటూ ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి (Infosys Narayana murthy) కొత్త చర్చకు తెరలేపారు. కొందరు ఆయన మాటలతో ఏకీభవించగా.. మరికొందరు మాత్రం ప్రాక్టికల్‌గా అది సాధ్యం కాదని కొట్టిపారేశారు. భారత్‌ సూపర్ పవర్‌గా ఎదగాలంటే తప్పదని మరికొందరు అభిప్రాయపడ్డారు. నారాయణమూర్తి ఈ తరహా అభిప్రాయం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. కొవిడ్‌ అనంతరం రెండు మూడేళ్ల పాటు వారానికి 60 గంటలు చొప్పున పనిచేయాల్సిన అవసరం ఉందని, లేదంటే కోలుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. అయితే, ఒక్క నారాయణమూర్తే కాదు.. పని గంటల గురించి పలువురు బాస్‌లు ఇదే తరహా ప్రతిపాదనలు చేశారు. కొందరి అభిప్రాయాలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది కూడా.

చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా (Jackma) 996 అనే రూల్‌ను ప్రతిపాదించారు. దాని ప్రకారం.. ఉద్యోగులు వారంలో ఆరు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద టెక్‌ కంపెనీల్లోనూ, స్టార్టప్‌ల్లోనూ ఇదే విధానం అమలవుతోందని పేర్కొన్నారు. దీనిపై అప్పట్లో చైనా సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనివల్ల అసలు కుటుంబ జీవితమనేదే ఉండదంటూ ఆయన ప్రతిపాదనను తప్పుబట్టారు.

వర్క్‌కల్చర్‌పై నారాయణమూర్తి కామెంట్స్.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన

ట్విటర్‌ను కొనుగోలు చేసిన సమయంలో వేలాది ఉద్యోగులను తొలగించిన ఎలాన్‌ మస్క్‌ (Elon musk).. నవంబర్‌లో ఉద్యోగులకు ఓ మెయిల్ చేశారు. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, కష్టపడి పనిచేస్తేనే కంపెనీ మనుగడ కొనసాగుతుందని స్పష్టంచేశారు. అందుకే వారానికి 100 గంటలు చొప్పున పనిచేయాలని అందులో పేర్కొన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పని కోసం తాను కార్యాలయంలోనే పడుకొంటానని, ఉద్యోగులూ అదే పనిచేయాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.

‘బాగా తినండి. దృఢంగా ఉండి. అలాగే, రోజుకు 18 గంటలు పనిచేయండి’ అంటూ బాంబే షేవింగ్‌ కంపెనీ సీఈఓ శంతను దేశ్‌ పాండే లింక్డిన్‌లో గతేడాది పోస్ట్‌ పెట్టారు. ఫ్రెషర్లు కనీసం నాలుగైదేళ్ల పాటైనా రోజుకు 18 గంటలు చొప్పున పనిచేయాలని అప్పట్లో పేర్కొన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఉద్యోగ జీవితం కోసం వ్యక్తిగత జీవితాన్ని పోగొట్టుకోవాలా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. ఆ ఆరు గంటలు మాత్రం కూడా ఎందుకు అంటూ మరికొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెట్టారు.

ఇన్ని గంటల పాటు ఉద్యోగుల్ని పనిచేయమని చెప్పే బాస్‌లు ఇంతకీ ఎన్నెన్ని గంటలు పనిచేస్తున్నారన్న దానిపై  రెండు వేర్వేరు సర్వేలు ఆసక్తికర గణాంకాలను బయటపెట్టాయి. అమెరికాలో సగటున ఓ సీఈఓ సాధారణ రోజుల్లో 9.7 గంటలు, వారాంతాల్లో 3.9 గంటలు చొప్పున పనిచేస్తున్నారని తేలింది. మరో సర్వే ప్రకారం.. భారత్‌లో ఓ సీఈఓ సగటున వారానికి 39 గంటలు అంటే రోజుకు 8-9 గంటలు పనిచేస్తున్నారని తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని