IPO: వచ్చేవారం 3 ఐపీఓలు.. రూ.1,325 కోట్ల సమీకరణ

IPO: వచ్చేవారం మెయిన్‌బోర్డ్‌ సెగ్మెంట్‌లో మరో మూడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. రూ.1,325 కోట్లు సమీకరించనున్నాయి.

Updated : 03 Mar 2024 13:07 IST

IPO | దిల్లీ: వరుస ఐపీఓలతో (IPO) స్టాక్‌ మార్కెట్‌ వచ్చేవారమూ బిజీ బిజీగా ఉండనుంది. మొత్తం మూడు కంపెనీలు తమ తొలి పబ్లిక్‌ ఆఫర్లను ప్రారంభించనున్నాయి. రూ.1,325 కోట్లు సమీకరించనున్నాయి. గోపాల్‌ స్నాక్స్‌, ఆర్‌కే స్వామి, జేజీ కెమికల్స్‌ మెయిన్‌బోర్డు సెగ్మెంట్‌లో పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్నాయి. వీటి తర్వాత లగ్జరీ ఫర్నిచర్‌ బ్రాండ్‌ స్టాన్లీ లైఫ్‌స్టయిల్స్, క్రిస్టల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ సైతం ఈ నెలలోనే ఐపీఓకి రానున్నాయి.

సానుకూల స్థూల ఆర్థిక అంశాలతో పాటు ఇటీవల ఐపీఓకి (IPO) వచ్చిన కంపెనీలు మంచి లాభాలను ఇవ్వడం వల్లే పబ్లిక్‌ ఇష్యూలు క్యూ కట్టాయని మార్కెట్‌ నిపుణులు విశ్లేషించారు. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో 16 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రూ.13,000 కోట్లు సమీకరించాయి. రూ.224 కోట్ల నిధులను సమకూర్చుకోవడమే లక్ష్యంగా ప్రారంభమైన ముక్కా ప్రోటీన్స్‌ ఇష్యూ మార్చి 4న ముగియనుంది. 2023లో 58 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చి రూ.52,637 కోట్లు సమీకరించాయి.

గోపాల్ స్నాక్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ..

గోపాల్ స్నాక్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ (Gopal Snacks IPO) మార్చి 6-11 మధ్య జరగనుంది. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.381-401గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.650 కోట్లు సమీకరించనుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూలో ఎలాంటి కొత్త షేర్లను జారీ చేయడం లేదు. 1999లో రాజ్‌కోట్‌ కేంద్రంగా గోపాల్‌ స్నాక్స్‌ను స్థాపించారు. భారత్‌ సహా అంతర్జాతీయంగా నమ్‌కీన్‌, వెస్టర్న్‌ స్నాక్స్‌ వంటి ఉత్పత్తులను తయారుచేస్తోంది. 2023 సెప్టెంబరు నాటికి 10 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడు డిపోలు, 617 పంపిణీ కేంద్రాలున్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.1,128.86 కోట్లుగా ఉన్న కంపెనీ కార్యకలాపాల ఆదాయం 2023 నాటికి రూ.1,394.65 కోట్లకు చేరింది. లాభం రూ.21.12 కోట్ల నుంచి రూ.112.37 కోట్లకు పెరిగింది. కనీసం రూ.14,837తో 37 షేర్లు (ఒక లాట్‌) సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆర్‌కే స్వామి ఐపీఓ..

రూ.423.56 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తోన్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెటింగ్‌ సర్వీసెస్‌ సంస్థ ఆర్‌కే స్వామి ఐపీఓ (RK Swamy IPO) మార్చి 4-6 మధ్య జరగనుంది. షేరు ధరల శ్రేణిని రూ.270-288 మధ్య నిర్ణయించింది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ.173 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద మరో 250.56 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లను అందుబాటులో ఉంచనుంది. ఈ నిధులను డిజిటల్‌ వీడియో కంటెంట్‌ ప్రొడక్షన్‌ స్టూడియో, కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లు, కంప్యూటర్‌ ఆధారిత టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ కేంద్రాల ఏర్పాటుతో పాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నారు. ఐటీ మౌలిక వసతుల అభివృద్ధికీ కొంత డబ్బును వెచ్చించనున్నారు.

జేజీ కెమికల్స్ ఐపీఓ..

జింక్‌ ఆక్సైడ్‌ తయారీ సంస్థ జేజీ కెమికల్స్ ఐపీఓ (JG Chemicals IPO) మార్చి 5-7 మధ్య జరగనుంది. ధరల శ్రేణిని రూ.210-221గా నిర్ణయించింది. రూ.165 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా.. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద మరో రూ.86.2 కోట్లు సమకూర్చుకోనుంది. ఈ నిధుల్లో రూ.91 కోట్లను జేజీ కెమికల్స్‌ అనుబంధ సంస్థ బీడీజే ఆక్సైడ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయనుంది. మరో రూ.35 కోట్లు దీర్ఘకాల నిర్వహణ మూలధనంగా ఉపయోగించుకోనుంది. మిగతా వాటిని సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వాడుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని