Jio vs Airtel: ట్రాయ్‌కు ఎయిర్‌టెల్‌ ఫిర్యాదు.. జియో ఫైర్‌!

Jio slams Airtel: జియో బ్రాడ్‌బ్యాండ్‌ ద్వారా టీవీ ప్రసారాలను అందించడంపై ఎయిర్‌టెల్‌ ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై జియో మండిపడింది. వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకోవడానికే ఈ ఫిర్యాదు చేసిందని పేర్కొంది.

Published : 12 Apr 2023 21:17 IST

దిల్లీ: జియో ఫైబర్‌ (Jio Fiber) ద్వారా లైవ్‌ టీవీ ప్రసారాలను (Live TV) అందించడంపై ట్రాయ్‌కు ఎయిర్‌టెల్‌ (Airtel) చేసిన ఫిర్యాదు చేయడంపై జియో మండిపడింది. జియో ఫైబర్‌లో సరసమైన ధరల్లో సేవలను అందించడాన్ని ప్రత్యర్థి కంపెనీ ఓర్వలేకపోతోందని పేర్కొంది. తన సంకుచిత ప్రయోజనాల కోసం జియోపై బురద చల్లే ప్రయత్నంగా అభివర్ణించింది. భవిష్యత్‌లో ఎయిర్‌టెల్‌ మరోసారి ఇలాంటి ఫిర్యాదులు చేయకుండా హెచ్చరించాలంటూ ట్రాయ్‌ను తన లేఖలో కోరింది.

జియో టీవీలో ఐపీఎల్‌ ప్రసారం చేయడాన్ని ఉద్దేశించి ఎయిర్‌టెల్‌ ఈ ఫిర్యాదు చేసింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (RJIL) బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో ప్రత్యక్ష టీవీ ప్రసారాలను దోపిడీ ఆఫర్లతో జియో అందిస్తోందని పేర్కొంటూ మార్చి 31న ఎయిర్‌టెల్‌ ఈ ఫిర్యాదు చేసింది. అన్‌ రిజిస్టర్డ్‌ డిజిటల్ పంపిణీ ప్లాట్‌ఫాల ద్వారా బ్రాడ్‌కాస్ట్‌ కంటెంట్‌ను అందించడం ద్వారా ప్రసారకర్తలు డౌన్‌లింకింగ్ విధానాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ట్రాయ్‌ జియో వివరణ కోరగా.. ఏప్రిల్‌ 6న జియో సమాధానం ఇచ్చింది. తాజాగా ఈ లేఖ బయటకొచ్చింది.

తన వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే భారతీ ఎయిర్‌టెల్‌ ఈ ఫిర్యాదు చేసిందని ట్రాయ్‌కు రాసిన లేఖలో జియో పేర్కొంది. జియో ఫైబర్‌ తక్కువ ధరకే కస్టమర్లకు సేవలు అందించడాన్ని ఎయిర్‌టెల్‌ జీర్ణించుకోలేకపోతోందని పేర్కొంది. వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకునేందుకు చేసిన ఈ ఫిర్యాదును తోసిపుచ్చాలని జియో కోరింది.

‘‘రూ.198 (పన్నులు అదనం) అద్దెపై ఫైబర్‌ బ్యాకప్‌ ప్లాన్‌ కింద 10 ఎంబీపీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను జియో అందిస్తోంది. ఐదు నెలల అడ్వాన్సుపై ఈ సేవలు అందిస్తున్నాం. జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ (JPL) అందించే జియో ఓటీటీ యాప్స్‌ సహా 14 ఇతర ఓటీటీ యాప్స్‌ కావాలంటే అదనంగా రూ.100, 200 చొప్పున నెలవారీ యాడ్‌-ఆన్‌ ప్యాక్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. సరసమైన ధరల్లో బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌పై లిమిటెడ్‌ కనెక్టివిటీ సర్వీసులను మాత్రమే అందిస్తున్నాం. ఓటీటీ సేవలను గానీ, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవలను గానీ అందించడం లేదు’’ అని జియో పేర్కొంది. 

‘‘జేపీఎల్‌ అనేది ఓ అగ్రిగేటర్‌. జియో టీవీ ప్లస్‌ పేరిట ఓటీటీ యాప్స్‌ను ఇది అందిస్తుంది. జియో టీవీ ప్లస్‌ యాప్‌లో ఓటీటీ సహా ఇతర ఛానెళ్ల ప్రసారాలూ లభిస్తాయి. డిస్నీ+ హాట్‌స్టార్‌, జీ5, సోనీ లివ్‌ వంటి ఓటీటీ యాప్స్‌ కూడా టీవీ ఛానెళ్ల డిజిటల్‌ ఫీడ్‌ను అందిస్తున్నాయి. జియో ఫైబర్‌ సేవలు తీసుకుని ఓటీటీ యాప్స్‌కు సబ్‌స్క్రైబ్‌ చేసుకునే వారు.. ఓటీటీ సేవలతో పాటు ఛానెళ్లు సైతం పొందుతారు. ఎయిర్‌టెల్‌ కూడా అదే పనిచేస్తోంది. కాబట్టి ఎయిర్‌టెల్‌ చేసిన ఫిర్యాదులో ఎలాంటి ఆధారాలూ లేవు’’ అని జియో పేర్కొంది. కాబట్టి ఎయిర్‌టెల్‌ ఫిర్యాదును తిరస్కరించాలని ట్రాయ్‌ను కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని