Deepfake: వాట్సప్‌ చెయ్‌.. డీప్‌ఫేక్‌ను పట్టెయ్‌!

Deepfake: కృత్రిమ మేధ ఆధారంగా రూపొందిస్తున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు వాట్సప్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తున్నామని మెటా వెల్లడించింది.

Published : 20 Feb 2024 11:10 IST

Deepfake | ఇంటర్నెట్‌ డెస్క్‌: డీప్‌ఫేక్‌ల బెడద ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్‌ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ ఆధారంగా రూపొందిస్తున్న ఇలాంటి తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు వాట్సప్‌లో ప్రత్యేక ఫ్యాక్ట్‌ చెక్‌ హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు ‘మిస్‌ఇన్ఫర్మేషన్‌ కంబాట్‌ అలయన్స్‌ (MCA)’తో భాగస్వామ్యం అవుతున్నట్లు వెల్లడించింది. 2024 మార్చి నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

ఈ హెల్ప్‌లైన్‌ సాయంతో MCA, దాని అనుబంధ స్వతంత్ర ఫ్యాక్ట్-చెకర్లు, పరిశోధన సంస్థలు వైరలవుతున్న తప్పుడు సమాచారాన్ని, ముఖ్యంగా డీప్‌ఫేక్‌లను గుర్తిస్తాయని మెటా వెల్లడించింది. ఇంగ్లిష్‌, హిందీ, తమిళం, తెలుగు భాషలకు స్పందించే వాట్సప్‌ (WhatsApp) చాట్‌బాట్‌ను సంప్రదించి ప్రజలు డీప్‌ఫేక్‌లపై సమాచారాన్ని పొందొచ్చని పేర్కొంది. హెల్ప్‌లైన్‌ ద్వారా వచ్చే మెసేజ్‌ల నిర్వహణ కోసం ఎంసీఏ ప్రత్యేకంగా ‘డీప్‌ఫేక్‌ అనాలసిస్‌ యూనిట్‌’ నెలకొల్పుతుందని తెలిపింది.

తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, అరికట్టడం, ప్రజలకు అవగాహన కల్పించడం, సరైన సమాచారాన్ని అందుబాటులో ఉంచడమే వాట్సప్‌ హెల్ప్‌లైన్‌ ముఖ్య ఉద్దేశమని మెటా వివరించింది. ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది. వాట్సప్‌లో వచ్చే సందేహాత్మక మెసేజ్‌లను ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని