Customer ID: మొబైల్‌ యూజర్లకు త్వరలో ఆధార్‌ తరహా ఐడీ!

Mobile users: మొబైల్‌ యూజర్లకు త్వరలో కస్టమర్‌ ఐడీ కేటాయించనున్నారు. దీనివల్ల సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఉపయోగడుతుంది.

Published : 07 Nov 2023 15:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మొబైల్‌ సిమ్‌ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు కేంద్రం నిబంధనలు కఠినతరం చేస్తోంది. సిమ్‌ కార్డు విక్రేతలకు కేవైసీ నిబంధనలను అమలు చేయాలని, బల్క్‌ సిమ్‌ విక్రయాలనూ నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడు కొత్తగా మొబైల్‌ యూజర్లకు ఆధార్‌ తరహాలో కస్టమర్‌ ఐడీ పేరిట విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయాలనుకుంటోంది. ప్రధాన సిమ్‌కార్డుతో పాటు అనుబంధంగా ఉన్న ఫోన్‌ కనెక్షన్లను గుర్తించేందుకు ఈ ఐడీ ఉపయోగపడుతుంది. వినియోగదారులను సైబర్‌ మోసాలను రక్షించడంతో పాటు, ప్రభుత్వ పథకాలు నేరుగా అందించేందుకు ఈ ఐడీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను టెలికాం విభాగం ఇప్పటికే సిద్ధం చేసిందని ‘ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌’ తన కథనంలో పేర్కొంది.

ఆధార్‌కు 14 అంకెలు కలిగిన ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ హెల్త్‌ అకౌంట్‌ను లింక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల డాక్టర్లు, బీమా సంస్థలు వ్యక్తుల వైద్య సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలు పడుతోంది. ఇదే తరహాలో మొబైల్‌ సబ్‌స్క్రైబర్లకు కేటాయించే కస్టమర్‌ ఐడీ ద్వారా సిమ్‌ కార్డును ట్రాక్‌ చేయడంతో పాటు సిమ్‌ కొనుగోలు చేసిన ప్రదేశం, సిమ్‌ కార్డు వాస్తవ యజమాని వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

సైబర్‌ నేరాలపై ఫేషియల్‌ రికగ్నిషన్‌ అస్త్రం.. 64 లక్షల ఫోన్‌ కనెక్షన్లు రద్దు

దేశంలో ఒక వ్యక్తి గరిష్ఠంగా 9 సిమ్‌కార్డులను మాత్రమే కలిగి ఉండేందుకు అర్హత ఉంది. కానీ ఇది సరిగ్గా అమలు కావడం లేదు. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారిత ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ఆధారంగా ఆడిట్‌ నిర్వహిస్తే తప్ప ఇలాంటివి గుర్తించడం సాధ్యపడడం లేదు. అలా ఈ మధ్యే 64 లక్షల మొబైల్‌ కనెక్షన్లను ప్రభుత్వం రద్దు చేసింది. అదే ఈ కస్టమర్‌ ఐడీ ద్వారా అయితే ఒక కస్టమర్‌కు నిర్దేశిత సంఖ్య కంటే మించి అధికంగా సిమ్‌ కార్డులను జారీ చేయడాన్ని అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 

కస్టమర్‌ ఐడీ ద్వారా సిమ్‌కార్డు వాస్తవంగా ఎవరు వాడుతున్నారనే వివరాలను ప్రభుత్వం తెలుసుకోగలుగుతుందని చెప్తున్నారు. సిమ్‌కార్డు జారీ సమయంలోనూ ఆ వివరాలను ఇకపై కోరే అవకాశం ఉంది. దీనివల్ల డేటా ప్రొటెక్షన్‌ బిల్లుకు అనుగుణంగా పిల్లల మొబైల్‌ వినియోగంపై తల్లిదండ్రుల అనుమతిని సైతం ధ్రువీకరించుకోవడానికి మొబైల్‌ కంపెనీలకు వీలు పడుతుంది. కస్టమర్‌ ఐడీ ద్వారా మోసపూరిత మొబైల్‌ కనెక్షన్లు నివారించొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కస్టమర్‌ ఐడీల ద్వారా వయసు, జెండర్‌, వైవాహిక స్థితి, ఆదాయం, చదువు, ఉద్యోగం వంటి డెమోగ్రఫీ వంటి వివరాల ఆధారంగా ఆ సమూహాన్ని గ్రూప్‌ చేయడానికి దోహదపడుతుందని, వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరించినట్లు ప్రభుత్వం దృష్టికి వస్తే ఆ కస్టమర్‌ ఐడీతో ఉన్న నంబర్లన్నింటినీ ఒకేసారి బ్లాక్‌ చేయడానికి వీలు పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని