మనీలాండరింగ్‌ ఆరోపణలు.. కేవైసీ ఉల్లంఘనలు.. ‘Paytm’పై చర్యలు ఇందుకేనా?

Paytm payments Bank: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనీలాండరింగ్‌ ఆరోపణలు, కేవైసీ ఉల్లంఘనలు ఇందుకు నేపథ్యమని తెలుస్తోంది.

Published : 03 Feb 2024 21:56 IST

దిల్లీ: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై (Paytm payments Bank) ఆర్‌బీఐ ఆంక్షలకు సంబంధించి కొన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మనీలాండరింగ్‌ ఆరోపణలు, కేవైసీ నిబంధనలు పాటించకపోవడమే ఆర్‌బీఐ కఠిన నిర్ణయం వెనక కారణమని తెలుస్తోంది. పేటీఎం వ్యాలెట్‌, పేమెంట్స్‌ బ్యాంకింగ్‌ మధ్య కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగలోకి దిగే అవకాశమూ ఉందని తెలుస్తోంది.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఇటీవల ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వినియోగదారుల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వ్యాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు చేయకూడదని స్పష్టం చేసింది. ఇందుకోసం ఫిబ్రవరి 29 వరకు గడువు ఇచ్చింది. అంటే అప్పటివరకూ పేమెంట్స్‌ బ్యాంక్‌ సేవలను ఖాతాదారులు వినియోగించుకోవచ్చు. పేటీఎం ఇచ్చే సమాధానంతో ఆర్‌బీఐ సంతృప్తి చెందకపోతే నిర్దేశిత గడువు తర్వాత పేమెంట్స్‌ బ్యాంక్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి.

కొత్త ఏడాదిలోనూ ఉద్యోగాల కోత.. 30 వేల మందికి ఉద్వాసన!

ఒకే పాన్‌.. వేలాది అకౌంట్లు..

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు సంబంధించి కేవైసీ చేయని లక్షలాది ఖాతాలు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకే పాన్‌తో అనేక వేలాది ఖాతాలు తెరిచిన ఉదంతాలు వెలుగుచూసినట్లు సమాచారం. కేవైసీ చేసిన ఖాతాలకు నిర్దేశించిన గరిష్ఠ పరిమితిని మించి కొన్నిసార్లు ఆయా ఖాతాల్లో లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. దీంతో మనీలాండరింగ్‌ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు సుమారు 35 కోట్ల ఇ-వ్యాలెట్లు ఉండగా.. అందులో 31 కోట్ల ఖాతాలు నిద్రాణ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కేవలం 4 కోట్లు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. అవి కూడా జీరో బ్యాలెన్స్‌, స్వల్ప మొత్తాలు కలిగి ఉన్నాయి. నిష్క్రియగా ఉన్న ఖాతాలను మనీలాండరింగ్‌ కోసం వినియోగించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఓ అనలిస్ట్‌ పేర్కొన్నారు.

పదే పదే ఉల్లంఘనలు

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో కేవైసీ ఉల్లంఘలను ఆర్‌బీఐ 2021లోనే గుర్తించింది. వీటిని సరిచేసుకోవాలని సూచించింది. అయినా ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టినట్లు తెలిసింది. ఆర్‌బీఐకి సమర్పించిన పలు నివేదికల్లోనూ అసంపూర్తి, తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో 2022 మార్చిలో పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది.  కొత్త కస్టమర్లను చేర్చుకోవడం విషయంలో ఆంక్షలు విధించింది.

రంగంలోకి ఈడీ?

డిజిటల్‌ మోసాల బారిన పడి పలు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు వెలుగుచూసినప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. 2022 సెప్టెంబర్‌లో పేమెంట్స్‌ బ్యాంక్‌ మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ సహా ఇతర పేమెంట్‌ అగ్రిగేటర్‌ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. తమ యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా వ్యక్తుల వ్యక్తిగత డేటాను సేకరించిన డిజిటల్‌ రుణ సంస్థలు.. ఈ వ్యాలెట్లు, కొన్ని పేమెంట్‌ అగ్రిగేటర్ల సాయంతో మోసాలకు తెరతీశారని ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో అవసరమైతే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఈడీ విచారణ జరిగే అవకాశమూ లేకపోలేదని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఆర్‌బీఐ ఆదేశాల నేపథ్యంలో రెండు ట్రేడింగ్‌ సెషన్లలో వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ షేర్లు 40 శాతం మేర క్షీణించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని