Layoffs: కొత్త ఏడాదిలోనూ ఉద్యోగాల కోత.. 30 వేల మందికి ఉద్వాసన!

ప్రపంచవ్యాప్తంగా కొలువులు ఊడుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇప్పటికే 30 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

Updated : 03 Feb 2024 19:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొదలైన లేఆఫ్‌ల పర్వం ఇంకా కొనసాగుతోంది. చిన్నా, పెద్ద కంపెనీలు అన్న తేడా లేకుండా గతేడాది భారీగా ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది కూడా తొలగింపులను కొనసాగిస్తున్నాయి. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఒక్క 2024 జనవరిలోనే 30 వేల మంది ఉద్యోగులను పలు కంపెనీలు తొలగించాయి. ఫిబ్రవరి 3 వరకు 122 టెక్‌ కంపెనీలు 31,751 మంది ఉద్యోగులను ఇళ్లకు సాగనంపాయి.

లేఆఫ్‌లను ట్రాక్‌ చేసే వెబ్‌సైట్‌ Layoffs.fyi ఈ విషయాన్ని వెల్లడించింది. పెద్ద టెక్‌ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు గత రెండేళ్లుగా 4.25 లక్షల మందిని ఇంటికి పంపించినట్లు ఆ వెబ్‌సైట్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2022లో 1.64 లక్షల మందిని, 2023లో 2.62 లక్షల మందిని కంపెనీలు తొలగించాయి. ఈ రెండేళ్లలో భారత్‌లోనే 36వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 

ప్రస్తుత ఏడాది కోతల విషయానికొస్తే.. ప్రముఖ వీడియో కమ్యూనికేషన్‌ యాప్‌ జూమ్‌ 150 మందిని తొలగించింది. క్లౌడ్‌ సాఫ్ట్‌వేర్‌ వెండర్‌ ఓక్తా 400 మందికి ఉద్వాసన పలికింది. ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే పేపాల్‌ గత నెలలో ఏకంగా 2,500 మందిని తొలగించింది. ఐరోబో 350, సేల్స్‌ ఫోర్స్‌ 700, స్విగ్గీ 300-400, ఈబే 1000 చొప్పున ఉద్యోగాలను తొలగించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ గూగుల్‌ సైతం ఇందుకు మినహాయింపు కాదు. డిసెంబర్‌-జనవరి మధ్య వెయ్యి మందిని తొలగించగా.. భవిష్యత్‌లో మరికొందరినీ తొలగిస్తామని ఇప్పటికే వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని