GDP: 2024లో భారత జీడీపీ 8%.. మూడీస్‌ అంచనా

GDP: 2024 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 8 శాతంగా నమోదు కావొచ్చని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్స్‌ సంస్థ మూడీస్‌ తెలిపింది.

Published : 07 Mar 2024 23:42 IST

దిల్లీ: భారత వృద్ధి రేటు అంచనాలను ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్స్‌ సంస్థ మూడీస్‌ (Moodys) మరోసారి పెంచింది. 2024లో భారత జీడీపీ 6.6 శాతంగా ఉంటుందని గతంలో తెలిపిన సంస్థ.. తాజాగా దాన్ని 8శాతానికి పెంచింది. వృద్ధి రేటు కొనసాగడానికి బలమైన దేశీయ గిరాకీ, మూలధన వ్యయాలు దోహదమని పేర్కొంది. ఇక మూడీస్‌ తాజా అంచనా గత నవంబర్‌లో చేసిన దానికంటే 140 బేసిస్‌ పాయింట్లు ఎక్కువ.

జీ20లోని ప్రధాన దేశాల్లో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మూడీస్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మార్చి ముగిసే సమయానికి 8 శాతానికి చేరుకొనే అవకాశం ఉందని పేర్కొంది. ద్రవ్యోల్బణం 2022-23 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 6.7 శాతం ఉండగా.. 2023-24లో 5.5 శాతానికి దిగి రావొచ్చని అంచనా వేసింది. 

రూ.67 వేలు దాటిన బంగారం ధర

జాతీయ గణాంక కార్యాలయం (NSO) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో 8.4 శాతం వృద్ధి అంచనా వేసింది. మొదటి, రెండు త్రైమాసికాల్లో జీడీపీ అంచనాలను మొదట 7.8 శాతం, 7.6 శాతంగా పేర్కొన్నప్పటికీ.. తర్వాత 8.2 శాతం, 8.1 శాతంగా సవరించింది. ప్రభుత్వం విడుదల చేసిన మూడో త్రైమాసికంలో భారత వృద్ధి రేటు గణాంకాల ఆధారంగా దేశ జీడీపీ 8 శాతానికి చేరే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ఈ ప్రకటన వెల్లడించిన మరుసటి రోజే మూడిస్‌ నుంచి ఈ వృద్ధి అంచనాలు వెలువడటం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని