Elon Musk: మస్క్‌ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ!

Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన చేశారు. సోషల్‌మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ప్రీమియం, ప్రీమియం ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. 

Published : 28 Mar 2024 17:51 IST

Elon Musk | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ యూజర్లకు ఎలాన్‌ మస్క్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. 2,500కు పైగా వెరిఫైడ్‌ ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు ప్రీమియం (premium) సేవల్ని ఉచితంగా అందివ్వనున్నట్లు తెలిపారు. 5 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్న ‘ఎక్స్‌’ యూజర్లకు ప్రీమియం ప్లస్‌ (Premium+) సర్వీసులు ఫ్రీగా యాక్సెస్ చేసే సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.

కంటెంట్ క్రియేటర్లకు, ఇన్‌ఫ్లుయెన్సర్లు మెరుగైన ఫీచర్లు అందించాలనే ఉద్దేశంతో ఈ సదుపాయం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మస్క్‌ ఆధ్వర్యంలోని ‘ఎక్స్‌’ ఇప్పటికే ప్రీమియం, ప్రీమియం+ ఫీచర్లను అందిస్తోంది. సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ప్రకారం.. ప్రీమియం ప్లస్‌ చందాదారులు ప్రకటనలు లేకుండా ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. పోస్ట్‌ చేసిన ట్వీట్‌ను గంటలోపు ఎడిట్‌ చేయొచ్చు. 25,000 అక్షరాల వరకు పోస్ట్‌ చేసే సదుపాయం కూడా ఉంటుంది. ఇక ప్రీమియం, ప్రీమియం+.. సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వాళ్లు కృత్రిమ మేధ సంస్థ ‘ఎక్స్‌ఏఐ’ అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ (Grok)ను యాక్సెస్‌ చేయొచ్చు. నెలకు రూ.1,300 లేదా ఏడాదికి రూ.13,600 వెచ్చించే ప్రీమియం ప్లస్‌ చందాదారులకు మాత్రమే గ్రోక్‌ అందుబాటులో ఉండేది.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్‌!

గ్రోక్‌ (Grok)ను మొదట ప్రీమియం ప్లస్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ప్రీమియం చందాదారులకు ఉపయోగించుకొనే సదుపాయం కల్పించారు. ఇప్పుడు ఫ్రీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ పొందేవారు దీన్ని వాడొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొటున్న వేళ.. యూజర్లను ఆకర్షించడంలో భాగంగా ఈ సదుపాయం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘ఎక్స్‌’ను వినియోగిస్తున్న వారి సంఖ్య తగ్గిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయమూ క్షీణిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మస్క్‌ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని