Elon Musk: భారత్‌లో ఎలాన్‌ మస్క్‌ పర్యటన వాయిదా

అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మస్క్‌(Elon Musk) భారత్‌ పర్యటన మరింత ఆలస్యం కానుంది.  

Updated : 20 Apr 2024 11:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్లా చీఫ్ ఎలాన్‌మస్క్ (Elon Musk) భారత్ పర్యటన వాయిదా పడింది. విద్యుత్‌ కార్ల తయారీ సంస్థకు చెందిన అతి ముఖ్యమైన బాధ్యతల కారణంగా తన పర్యటన ఆలస్యమవుతోందని ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మీడియా కథనాల ప్రకారం.. ఆయన ఈ నెల 21, 22 తేదీల్లో మనదేశంలో పర్యటించాల్సి ఉంది. ఈ రెండు రోజుల ప్రణాళికలో ప్రధాని మోదీ-మస్క్‌ కీలక భేటీ కూడా ఒకటి. అనంతరం వారు పెట్టుబడుల గురించి ప్రకటన చేస్తారని అంతా భావించారు.

ఈ ఏడాదిలో భారత పర్యటన, ప్రధాని మోదీ భేటీని ధ్రువీకరిస్తూ కొద్దిరోజుల క్రితం మస్క్‌ (Elon Musk) సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల దీని గురించి ప్రధాని మోదీని అడగ్గా.. ‘‘భారత్‌కు పెట్టుబడులు రావాలని నేను కోరుకుంటా. ఇక్కడ ఎవరు పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదు. కానీ, తయారీరంగంలో మన దేశ ప్రజల స్వేదం ఉండాల్సిందే. మన మాతృభూమి ప్రత్యేకత ఉండాలి. అప్పుడే మన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి’’ అని వ్యాఖ్యానించారు.

2026లో ఇండిగో ఎయిర్‌ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా

ఈసందర్భంగా తన అభిమానిని అంటూ మస్క్‌ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తూ.. ‘‘మోదీ మద్దతుదారును అంటూ మస్క్‌ చెప్పారు. వాస్తవానికి ఆయన భారత్‌కు మద్దతుదారు. 2015లో నేను టెస్లా ఫ్యాక్టరీని సందర్శించినప్పుడు ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకుని మరీ నాతో సమావేశమయ్యారు. తన ఫ్యాక్టరీ మొత్తాన్ని చూపించారు. ఆయన దృక్పథం ఏంటో నాకు అర్థమైంది’’ అని తెలిపారు.

భారత్‌లోకి టెస్లా (Tesla) ప్రవేశంపై గతకొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో విద్యుత్తు కార్ల వినియోగం అవసరమని గతంలో మస్క్‌ అభిప్రాయపడ్డారు. తయారీ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలం కోసం టెస్లా వివిధ రాష్ట్రప్రభుత్వాలను సంప్రదించినట్లు సమాచారం. మహారాష్ట్ర, గుజరాత్‌ ఆకర్షణీయ ప్రతిపాదనలను వారి ముందుంచినట్లు, తెలంగాణ ప్రభుత్వంతోనూ చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2-3 బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలోనే, ఈ కుబేరుడు పలువిషయాల్లో మనకు అనుకూలంగా స్పందిస్తున్నారు. యూఎన్‌ఎస్సీలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు