Narayana Murthy: నారాయణమూర్తి మనవడికి జాక్‌పాట్‌.. ఒక్క రోజులో ₹4 కోట్లు!

నారాయణమూర్తి మనవడు జాక్‌పాట్‌ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్‌తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు.

Updated : 19 Apr 2024 15:16 IST

Narayana Murthy | ఇంటర్నెట్‌ డెస్క్: ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి (Narayana Murthy) ఐదు నెలల మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌మూర్తి మరింత సంపన్నుడు కానున్నాడు. తాత బహుమానంగా ఇచ్చిన కంపెనీ షేర్ల ద్వారా ఊహ తెలియకముందే కోట్లాది రూపాయలకు యజమానిగా మారిన ఈ చిన్నారి.. ఇప్పుడు మరో రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌ గురువారం వార్షిక డివిడెండ్ ప్రకటించడమే ఇందుక్కారణం.

2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్‌ నిన్న ప్రకటించింది. దీంతో పాటు రూ.20 తుది డివిడెండ్‌, మరో రూ.8 ప్రత్యేక డివిడెండ్‌ ప్రకటించింది. అంటే ఒక్కో షేరుకు రూ.28 చొప్పున డివిడెండ్‌గా చెల్లించాలని ఇన్ఫీ నిర్ణయించింది. ఇందుకు మే 31 రికార్డు డేట్‌గా పేర్కొంది. ఈ ఏడాది జులై 1న చెల్లింపులు చేయనుంది. అలా నారాయణమూర్తి మనవడైన రోహన్‌ కూడా డివిడెండ్‌ రూపంలో రూ.4.2 కోట్లు అందుకోనున్నాడు.

ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...

నారాయణమూర్తికి ఇన్ఫోసిస్‌లో 0.40 శాతం వాటాకు సమానమైన 1.51 కోట్ల కంపెనీ షేర్లు ఉన్నాయి. అందులో 15 లక్షల షేర్లను ఏకాగ్రహ్‌కు.. నారాయణమూర్తి గత నెల బహుమానంగా ఇచ్చారు. అప్పట్లో ఈ షేర్ల విలువ సుమారు రూ.240 కోట్లు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. తాత ఇచ్చిన విలువైన బహుమతితో ఏకాగ్రహ్‌కు ఇన్ఫోసిస్‌లో 0.04 శాతం వాటా లభించింది. దీంతో భారత్‌లో అత్యంత పిన్న వయస్కుడైన మిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. తాజాగా డివిడెండ్‌ రూపంలో మరో రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు అక్షతా మూర్తి, కొడుకు రోహన్‌ మూర్తి. అక్షతా, రిషి సునాక్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రోహన్‌ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్‌ల కుమారుడే ఏకాగ్రహ్.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని