Nestle India: బేబీ ఫుడ్‌లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా

బేబీ ఫుడ్స్‌లో చక్కెర అధిక స్థాయిలో వినియోగిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై నెస్లే ఇండియా వివరణ ఇచ్చింది.

Published : 18 Apr 2024 16:55 IST

Nestle India | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో విస్తృతంగా వినియోగించే నెస్లే ఇండియాకు (Nestle India) చెందిన బేబీ ఫుడ్స్‌లో చక్కెర, తేనె వంటి పదార్థాలు వినియోగిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇన్వెస్టిగేషన్‌ ఆర్గనైజేషన్‌ ‘పబ్లిక్‌ ఐ’ దీనికి సంబంధించిన కొన్ని అంశాలను బయట పెట్టినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. తాజాగా నెస్లే ఇండియా దీనిపై వివరణ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..?

భారత్‌ సహా కొన్ని పేద దేశాల్లో నెస్లే విక్రయించే బేబీ ఫుడ్స్‌లో చక్కెర వినియోగం అధికంగా ఉంటోందని తమ పరిశోధనలో తేలినట్లు పబ్లిక్‌ ఐ పేర్కొంది. చిన్నారుల్లో స్థూలకాయం, దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టేందుకు నిర్దేశించిన అంతర్జాతీయ మార్గదర్శకాలకు నెస్లే ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ముఖ్యంగా చిన్నారులకు సంబంధించిన ఆహారంలో ఒక్కో సర్వ్‌లో 3 గ్రాముల చక్కెర ఉంటోందని ఈ నివేదిక తెలిపింది. అదే సమయంలో యూకే సహా ఇతర యూరోపియన్‌ మార్కెట్లలో ఎలాంటి చక్కెరా ఉండడం లేదని వెల్లడించింది. భారత్‌తో పోలిస్తే థాయ్‌లాండ్‌, ఇథియోపియాలో చక్కెర వినియోగం మరింత ఎక్కువగా ఉంటున్నట్లు తన నివేదికలో తెలిపింది.

యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌పే, గూగుల్‌పే వాటా 86%

తమ ఆహార ఉత్పత్తుల్లో చక్కెర వినియోగం గురించి వచ్చిన ఈ ఆరోపణలపై నెస్లే ఇండియా స్పందిచింది. గడిచిన ఐదేళ్లుగా చక్కెర వినియోగాన్ని 30 శాతం మేర తగ్గించినట్లు ఆ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు వివరణ ఇచ్చారు. ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను సమీక్షించుకుంటున్నామని తెలిపారు. నాణ్యత, రుచిలో విషయంలో రాజీ పడకుండా వీలైనంత వరకు చక్కెర స్థాయిలను మరింత తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వార్తల నేపథ్యంలో గురువారం నెస్లే ఇండియా షేరు ఓ దశలో 5 శాతం మేర క్షీణించింది. చివరికి 2.95 శాతం నష్టపోయి రూ.2,471 వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని