Scam Alert: ఆ స్టాక్‌ రికమండేషన్లు నావి కావు.. ఇన్వెస్టర్లకు నిఖిల్‌ కామత్‌ అలర్ట్‌!

Scam Alert: స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టండి. మంచి లాభాలు ఆర్జించే స్టాక్స్‌ను సూచిస్తాం అంటూ ప్రముఖుల పేరిట రూపొందించిన ప్రకటనలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

Updated : 12 Apr 2024 15:54 IST

Hand picked stocks scam | ఇంటర్నెట్‌డెస్క్‌: స్కామ్‌.. స్కామ్‌.. స్కామ్‌.. రోజూ దీనికి సంబంధించి ఏదోఒక వార్త బయటకు వస్తూనే ఉంది. ప్రస్తుతం ట్రెండ్‌లో నడుస్తున్న అంశాన్ని ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు కొత్త పంథాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెరిగాయి. దీనిపై అవగాహన లేకపోయినా పెద్ద మొత్తంలో డబ్బులొస్తాయనే ఆశతో చాలామంది వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. అలాంటివారిపై కేటుగాళ్లు కన్నేశారు. దీనికోసం రూపొందించిన యాడ్‌లో ఏకంగా బ్రోకరేజ్‌ సంస్థకు చెందిన వ్యక్తి ఫొటోనే ఉపయోగించారు.

‘‘ఏప్రిల్‌లో మంచి లాభాలు తెచ్చిపెట్టే స్టాక్స్‌ గురించి చెబుతాం. దీనికోసం మా వాట్సప్‌ గ్రూప్‌లో చేరండి.  రోజూ 1-3 స్టాక్‌లు ఎంపిక చేయాలని సూచిస్తాం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఫస్ట్‌ అప్లై చేసుకున్న 1000 మందికి మాత్రమే ఉచితం’’ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటనపై ఏకంగా స్టాక్ బ్రోకరేజ్‌ సంస్థ జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌ (Zerodha's CEO Nikhil Kamath) ఫొటో కనిపిస్తుంది. ఆయనే స్వయంగా స్టాక్‌లు సజ్జెస్ట్‌ చేస్తారంటూ ఆ యాడ్‌ను తయారుచేశారు. ఈ పోస్ట్‌ నెట్టింట నిఖిల్‌ కంటపడింది. దీంతో ఆయన ‘‘ఎక్స్‌’’ వేదికగా స్పందించారు. 

విశాఖ సహా మరో 14 విమానాశ్రయాల్లో డిజి యాత్ర

‘‘ఈ ప్రకటన నా నుంచి వచ్చింది కాదు. నేను ఎలాంటి వాట్సప్‌ గ్రూపుల్లో చేరాలని ప్రకటన చేయలేదు. దయచేసి ఇటువంటి స్కామ్‌లపై జాగ్రత్త వహించండి’’ అంటూ కామత్‌ పోస్ట్‌ చేశారు. తాను ఎటువంటి పెయిడ్‌ ప్రమోషన్లు చేయనని స్పష్టంచేస్తూ యాడ్‌కు సంబంధించిన ఫొటోను పంచుకున్నారు. మరోవైపు.. స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల పేరిట జరుగుతున్న మోసాలు ఎక్కువగా బయటకొస్తున్నాయి. ఇటీవల నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) చీఫ్‌ ఎండీ, సీఈఓ ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ (Ashishkumar Chauhan)కు చెందిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. పెట్టుబడులు పెట్టాలంటూ ఆయన ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్‌ వీడియోలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేశాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈ స్పందించి ఇలాంటి వీడియోలతో జాగ్రత్త వహించాలని హెచ్చరించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని