Artificial Intelligence: ఏఐ పురోగతిని నిలువరించలేం: మైక్రోసాఫ్ట్‌ అధ్యక్షుడు

Artificial Intelligence: కృత్రిమ మేధను బాధ్యతతో వాడుకోవడం ఒక్కటే మార్గమని మైక్రోసాఫ్ట్‌ అధ్యక్షుడు బ్రాడ్‌ స్మిత్‌ అన్నారు. దీన్ని నియంత్రించడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

Published : 28 Aug 2023 10:58 IST

దిల్లీ: కృత్రిమ మేధ (Artificial Intelligence- AI) వినియోగంపై అంతర్జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్‌ అధ్యక్షుడు బ్రాడ్‌ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ శక్తిమంతమైన సాంకేతికత (Artificial Intelligence)లో వస్తున్న పురోగతిని నిలువరించడం సాధ్యం కాదని చెప్పారు. ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో నిబంధనలు రూపొందించడం ఒక్కటే మార్గమని సూచించారు. ఈ ప్రక్రియ వీలైనంత వేగంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. పీటీఐకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బాధ్యతతో వినియోగించుకోవాలి..

భారత్‌ సహా యావత్‌ ప్రపంచానికి ఏఐ (Artificial Intelligence) ఎంతో మేలు చేస్తుందని బ్రాడ్‌ స్మిత్‌ అన్నారు. అయితే, దీన్ని బాధ్యతతో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రోజువారీ కార్యకలాపాలపై ఏఐ వల్ల ఎంతో సానుకూల ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇటీవల భారత పార్లమెంట్‌ ఆమోదం పొందిన ‘సమాచార రక్షణ చట్టం’ బాగుందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే దేశంలో వస్తున్న డిజిటల్‌ మౌలికవసతులూ బాగున్నాయని కితాబిచ్చారు.

ఏఐ నైతిక వినియోగమే లక్ష్యం

ప్రతిభకు భారత్‌ అడ్డా..

భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ మరిన్ని పెట్టుబడులకు కట్టుబడి ఉందని స్మిత్‌ ఉద్ఘాటించారు. అలాగే ఉద్యోగుల నియామకాలూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. తమ కంపెనీకి భారత్‌ అత్యంత ప్రాధాన్య దేశంగా మారిందని తెలిపారు. కేవలం వినియోగదారుల పరంగానే కాకుండా.. ప్రతిభగల ఉద్యోగులకూ భారత్‌ అడ్డాగా మారిందన్నారు. 12 నెలల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌లో భారత్‌కు చెందిన ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.

ఇతర దేశాలకు భారత్‌ స్ఫూర్తి..

డిజిటల్‌ సాంకేతికత విషయంలో 2020 తర్వాత భారత్‌ చూపించిన పురోగతి మరే దేశమూ సాధించలేకపోయిందని స్మిత్‌ అభిప్రాయపడ్డారు. భారత డిజిటల్‌ మౌలిక వసతులు పురోగమించడమే కాకుండా ఇతర దేశాలనూ ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. పలు దేశాలు భారత్‌ తరహా డిజిటల్‌ సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

కృత్రిమ మేధ (AI) నైతిక వినియోగానికి అంతర్జాతీయ నిబంధనలు అవసరమని సీఐఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బి20 సమిట్‌ ఇండియా-2023 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం అన్నారు. ప్రపంచం మొత్తం ఏఐపై ఎంతో ఆసక్తిగా ఉందన్నారు. ఇదే సమయంలో నైతికతను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని