ఏఐ నైతిక వినియోగమే లక్ష్యం

ఆధునిక సాంకేతికతలు సమాజంపై అమిత ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో, కృత్రిమ మేధ (ఏఐ) నైతిక వినియోగానికి అంతర్జాతీయ నిబంధనలు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

Published : 28 Aug 2023 02:49 IST

అంతర్జాతీయ నిబంధనలు మేలు
బీ20 సమిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

దిల్లీ: ఆధునిక సాంకేతికతలు సమాజంపై అమిత ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో, కృత్రిమ మేధ (ఏఐ) నైతిక వినియోగానికి అంతర్జాతీయ నిబంధనలు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. క్రిప్టో కరెన్సీ సంబంధిత సమస్యల పరిష్కారానికి కూడా ఒక సమ్మిళిత నిబంధనావళి రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బీ20 సమిట్‌ ఇండియా-2023 కార్యక్రమంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. వాతావరణ మార్పు, ఇంధన రంగ సంక్షోభం, ఆహార సరఫరా వ్యవస్థల్లో అసమతౌల్యం, నీటి భద్రత వంటివి వ్యాపారాలపై పెను ప్రభావం చూపిస్తాయని, ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఉమ్మడి ప్రయత్నాలను పెంచాల్సిన అవసరం ఉన్నారు. ‘క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన సవాళ్ల విషయంలో మరింత సమీకృత విధానం అవసరం. అంతర్జాతీయ నిబంధనావళి రూపొందించి, అవి దుర్వినియోగం కాకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంద’ని అంతర్జాతీయ, దేశీయ వ్యాపార దిగ్గజాలకు మోదీ సూచించారు. ఇదే తరహాలో కృత్రిమ మేధ కోసం పని చేయాల్సి ఉందన్నారు. ‘ప్రపంచం మొత్తం ఏఐపై ఎంతో ఆసక్తిగా ఉంది. ఇదే సమయంలో నైతికతను పరిగణనలోకి తీసుకోవాలి. నైపుణ్యాల పునశ్చరణతో పాటు  సమాజంపై పడే ప్రభావం గురించి ఆందోళనలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిసి కట్టుగా పరిష్కరించుకోవాల’ని మోదీ పేర్కొన్నారు.

వినియోగదార్లే కీలకం అవ్వాలి

వినియోగదార్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ వ్యాపారాలు జరగాలని ప్రధాని సూచించారు. ఇందుకోసం అంతర్జాతీయ వినియోగదార్ల సంరక్షణ దినోత్సవం నిర్వహించాలని వ్యాపార వర్గాలకు పిలుపునిచ్చారు. ఉత్పత్తి దారులు, వినియోగదారుల మధ్య సమతూకం ఉన్నప్పుడే లాభదాయక మార్కెట్‌ సాధ్యపడుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలను కేవలం మార్కెట్‌ కోణంలో మాత్రమే చూడటం వల్ల.. కొన్నేళ్ల తర్వాతైనా వాణిజ్యానికి  హాని కలిగే అవకాశం ఉందని అన్నారు. చంద్రయాన్‌-3 విజయంతో దేశంలో పండుగ సీజన్‌ మొదలైందని, ఈ మిషన్‌ కోసం ప్రైవేటు రంగంలోని కంపెనీలు, ఎంఎస్‌ఎంఈలు చాలా వరకు విడిభాగాలను సమకూర్చాయని గుర్తు చేశారు. జీ20లో శాశ్వత సభ్యత్వం కోసం ఆఫ్రికా సమాఖ్యను ఆహ్వానించామని తెలిపారు.

  • వచ్చే నెలలో దిల్లీలో జీ20 సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆయా దేశాల మధ్య వ్యాపార సంబంధిత విషయాలను చర్చించేందుకు ఏర్పాటు చేసిన వేదికే బిజినెస్‌ 20 లేదా బీ20 ఫోరమ్‌. అంతర్జాతీయ వ్యాపార వర్గాలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది.  

ఆర్థిక శక్తి పెరుగుతోంది

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ విధానాల వల్ల, కొన్నేళ్లలో దేశంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య భారీగా పెరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పరిణామం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. ఇటీవల కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడుతున్నారని, వారంతా మధ్య తరగతి కంటే కాస్త దిగువ స్థాయిలో (నియో మిడిల్‌ క్లాస్‌) ఉన్నారని ఆయన అభివర్ణించారు. త్వరలోనే వీరంతా మధ్యతరగతి వర్గంలోకి చేరేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. వీరు తమ ఆకాంక్షలతో, దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తారని మోదీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని