ఎన్విడియా సంపద ఒక్క రోజులో బిగ్‌జంప్‌.. కంపెనీల మార్కెట్‌ విలువలూ దిగదుడుపే!

Nvidia shares jumps: ప్రముఖ చిప్‌ తయారీ కంపెనీ ఎన్విడియా స్టాక్‌ ఒక్కరోజులోనే 16 శాతం మేర పెరిగింది. దీంతో ఒక్కరోజులో కంపెనీ సంపద 277 బిలియన్‌ డాలర్ల మేర వృద్ధి చెందింది.

Published : 23 Feb 2024 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా కంపెనీ మంచి త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తే.. ఆ స్టాక్ రాణించడం సహజమే. దాని ప్రభావంతో కంపెనీ మార్కెట్‌ విలువ కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. కానీ, ఒక కంపెనీ ఒక రోజు సంపద కొన్ని కంపెనీల మార్కెట్‌ విలువలను దాటేస్తే దాన్ని ప్రభంజనమే అనాలి. ఆ ఘనతను సాధించింది అమెరికాకు చెందిన ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా (Nvidia). ఆ కంపెనీ షేర్లు ఒక్క రోజులో 16 శాతం రాణించడంతో కంపెనీ మార్కెట్‌ విలువ 277 బిలియన్‌ డాలర్ల మేర పెరిగింది. భారత్‌కు చెందిన అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ కంటే ఈ మొత్తం ఎక్కువ కావడం గమనార్హం.

వాల్‌స్ట్రీట్లో ఒక్క రోజులో ఇంత మొత్తం సంపద పెరగడం ఇదే తొలిసారి. అంతకుముందు మెటా సంస్థ మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో కంపెనీ షేర్లు ఫిబ్రవరి 2న రాణించాయి. దీంతో 196 బిలియన్‌ డాలర్ల సంపద పెరిగింది. ఇప్పుడు ఎన్విడియా ఆ రికార్డును తిరగరాసింది. దీంతో వాల్‌స్ట్రీట్‌లో మైక్రోసాఫ్ట్‌ (3 ట్రిలియన్‌ డాలర్లు), యాపిల్‌ (2.8 ట్రిలియన్‌ డాలర్లు) తర్వాత అతిపెద్ద స్టాక్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు సౌదీ అరామ్‌కో (2 ట్రిలియన్‌ డాలర్లు) తర్వాత 1.89 బిలియన్‌ డాలర్లతో నాలుగో అతిపెద్ద  స్టాక్‌గా అవతరించింది.

Xiaomi: ఆ స్క్రీన్‌ ప్రొటెక్టర్లు వాడొద్దు.. వినియోగదారులకు షావోమీ అలర్ట్‌!

ఎందుకింత పెరిగింది?

కాలిఫోర్నియాకు చెందిన ఎన్విడియా ఇటీవల మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. హై ఎండ్‌ ఏఐ చిప్‌ మార్కెట్‌లో 80 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ మార్కెట్‌ అంచనాలను మించి ఆదాయాన్ని నమోదు చేసింది. డిసెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 22.10 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. పైగా మెరుగైన భవిష్యత్‌ అంచనాలను ప్రకటించింది. దీంతో 17 బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్‌కు బై రేటింగ్‌ ఇచ్చాయి. ప్రైస్‌ టార్గెట్‌ను 1100 డాలర్ల నుంచి 1400 డాలర్లకు పెంచాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేరు 16 శాతం మేర రాణించి 785.38 డాలర్ల వద్ద ముగిసింది.

మార్కెట్‌ విలువలు దాటేసి

దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇటీవల అరుదైన మైలురాయిని అందుకుంది. తొలిసారి రూ.20 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను దాటింది. డాలర్‌ విలువ ప్రకారం లెక్కిస్తే రిలయన్స్‌ మార్కెట్‌ విలువ 243 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అయితే, ఎన్విడియా ఒక్క రోజులో పోగేసిన సంపద రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పూర్తి మార్కెట్‌ విలువ కంటే అధికం కావడం గమనార్హం. రిలయన్స్‌ ఒక్కటే కాదు.. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (265 బిలియన్‌ డాలర్లు), కోకా-కోలా (264 బిలియన్‌ డాలర్లు), నెట్‌ఫ్లిక్స్‌ (255 బిలియన్‌ డాలర్లు), యాక్సెంచర్‌ (233 బిలియన్‌ డాలర్లు), మెక్‌ డొనాల్డ్స్‌ (214 బిలియన్‌ డాలర్లు) వంటి ప్రముఖ కంపెనీల మార్కెట్‌ విలువలను ఎన్విడియా ఒక్కరోజు సంపద దాటేసిందన్నమాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని