Oneweb: శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌.. వన్‌వెబ్‌కు స్పేస్‌ రెగ్యులేటర్ నుంచి అనుమతులు

వన్‌వెబ్‌కు శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు సంబంధించి స్పేస్‌ రెగ్యులేటర్‌ నుంచి అనుమతులు మంజూరయ్యాయి. స్పెక్ట్రమ్‌ కేటాయింపు జరగాల్సి ఉంది.

Published : 21 Nov 2023 19:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ప్రారంభించేందుకు భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్‌ ఇండియాకు (Oneweb) కీలక అనుమతులు లభించాయి.  ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (IN-SPACe) నుంచి అనుమతులు పొందినట్లు యూటెల్‌శాట్ వన్‌వెబ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ తరహా అనుమతులు పొందిన తొలి సంస్థ తమదేనని పేర్కొంది. భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్‌ లండన్‌కు చెందిన యూటెల్‌శాట్‌ కంపెనీలో విలీనం అయ్యింది. విలీన సంస్థలో ఎయిర్‌టెల్‌ 21.2 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. భూ సమీప కక్ష్యలోలోని 618 శాటిలైట్ల ద్వారా వన్‌వెబ్‌ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలు అందించనుంది.

అంతరిక్ష కార్యకలాపాల నియంత్రణ, ఆయా కార్యకలాపాల కోసం అనుమతులను ఇన్‌-స్పేస్‌ మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా కమర్షియల్‌ కనెక్టివిటీ సేవలను ప్రారంభించేందుకు యూటెల్‌శాట్‌ వన్‌వెబ్‌కు అనుమతి మంజూరు చేసింది. దేశం నలుమూలకూ ఇంటర్నెట్‌ సేవలు అందించి డిజిటల్‌ ఇండియాగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ సంకల్పం దిశగా ఇదో ముందడుగు అని భారతీ గ్రూప్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్ పేర్కొన్నారు. స్పెక్ట్రమ్‌ అనుమతులు కూడా లభిస్తే శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ మంజూరు చేయాల్సి ఉంటుందని వన్‌వెబ్‌ పేర్కొంది.

‘ఆస్ట్రేలియాను కొనేస్తారా?’.. ప్రపంచ కప్‌ ఓటమిపై సత్య నాదెళ్ల స్పందన!

శాటిలైట్‌ ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు కావాల్సిన అనుమతులను టెలికాం విభాగం నుంచి ఇది వరకే వన్‌వెబ్‌ పొందింది. మరోవైపు వన్‌వెబ్‌తో పాటు శాటిలైట్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవల కోసం జియో శాట్‌కామ్‌, అమెజాన్‌, ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌ పోటీ పడుతున్నాయి. శాటిలైట్ సేవలు ప్రారంభించాలంటే డాట్‌ నుంచి జీఎపీసీఎస్‌ లైసెన్స్‌, స్పెక్ట్రమ్‌తో పాటు ఇన్‌-స్పేస్‌ ఆమోదం తప్పనిసరి. అయితే, స్పెక్ట్రమ్‌ ఎలా మంజూరు చేయాలన్న దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ట్రాయ్‌ దగ్గర ఈ అంశం పెండింగ్‌లో ఉంది. ట్రాయ్‌కి కొత్త ఛైర్మన్‌ వచ్చాక దీనికి సంబంధించిన సిఫార్సులు చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని