Credit card: ఆన్‌లైన్‌లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్‌ కార్డ్‌ వ్యయం

Credit card: క్రెడిట్‌ కార్డు ద్వారా జరుపుతున్న లావాదేవీలు 2024 మార్చిలో సరికొత్త మైలురాయిని చేరాయి.

Published : 25 Apr 2024 18:51 IST

Credit card | ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో క్రెడిట్‌ కార్డుల (Credit card) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ఈతరహా లావాదేవీలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఆన్‌లైన్‌లో చేసే వ్యయాలు సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఈ ఏడాది మార్చిలో తొలిసారి రూ.1,04,081 కోట్ల మైలురాయిని అధిగమించాయి. 2024 ఫిబ్రవరిలో నమోదైన రూ.94,774 కోట్లతో పోలిస్తే 10 శాతం పెరగ్గా.. 2023 మార్చిలో నమోదైన రూ.86,390 కోట్లతో పోలిస్తే ఏకంగా 20 శాతం వృద్ధి నమోదైంది. 

ఆఫ్‌లైన్‌లో జరిగే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (PoS) లావాదేవీలూ గణనీయంగా పెరిగాయి. గతేడాది మార్చిలో రూ.50,920 కోట్లుగా ఉన్న ఈ మొత్తం.. ఈ ఏడాది అదే సమయానికి రూ.60,378 కోట్లకు చేరింది. 19 శాతం వృద్ధి నమోదైంది. మొత్తంగా క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీలు 20 శాతం పెరిగి రూ.1,64,586 కోట్లకు చేరాయి. మరోవైపు దేశంలో క్రెడిట్‌ కార్డుల సంఖ్య సైతం 10.2 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే దాదాపు 20 శాతం పెరిగింది.

ఐసీఐసీఐ, యెస్‌ బ్యాంక్‌లో మే 1 నుంచి కొత్త సర్వీస్‌ ఛార్జీలు!

క్రెడిట్‌ కార్డ్‌ల జారీలో ఆయా సంస్థల మార్కెట్ వాటాను గమనిస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 20.2 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ఎస్‌బీఐ (18.5శాతం), ఐసీఐసీఐ (16.6శాతం), యాక్సిస్‌ (14శాతం), కోటక్‌ మహీంద్రా (5.8 శాతం) ఉన్నాయి. క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తున్న టాప్‌ 10 బ్యాంకులే మొత్తం 90 శాతం మార్కెట్‌ వాటాను కలిగిఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. సంఖ్యాపరంగా చూస్తే పీఓఎస్‌ లావాదేవీలు 28 శాతం పెరిగి 18 కోట్లకు చేరుకోగా.. ఆన్‌లైన్‌ లావాదేవీలు 33 శాతం పెరిగి 16.4 కోట్లకు చేరుకున్నాయి. చిన్న కొనుగోళ్లకూ క్రెడిట్‌ కార్డులను వినియోగిస్తుండటంతో వీటి పరిమాణం గణనీయంగా పెరిగింది. రూపే క్రెడిట్‌ కార్డులను యూపీఐకి లింక్‌ చేసుకునే వెసులుబాటు ఉండడమే దీనికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు