OpenAI: ఓపెన్‌ఏఐ మరో సంచలనం.. టెక్స్ట్‌ ఇస్తే నిమిషం వీడియో!

OpenAI Unveils Sora: ఓపెన్‌ఏఐ సంస్థ సోరా పేరిట ఏఐ ఆధారిత వీడియో జనరేటర్‌ను తీసుకొచ్చింది. ఇది మనం ఇచ్చిన కమాండ్‌ ఆధారంగా ఒక నిమిషం నిడివి కలిగిన వీడియోను రూపొందించగలదు.

Updated : 16 Feb 2024 16:46 IST

OpenAI Sora | ఇంటర్నెట్‌ డెస్క్‌: చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) మరో ఆవిష్కరణతో ముందుకొచ్చింది. చాట్‌జీపీటీ (ChatGPT) ద్వారా ఇప్పటికే ప్రజలకు చేరువైన ఈ సంస్థ.. తాజాగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత టెక్స్ట్‌-టు- వీడియో జనరేటర్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్‌కు సోరా (Sora) అని నామకరణం చేసింది. యూజర్‌ ఇచ్చిన ప్రాంప్ట్‌కు అనుగుణంగా ఇది ఒక నిమిషం నిడివిగల వీడియోను జనరేట్‌ చేయగలదని ఆ కంపెనీ ఎక్స్‌ ద్వారా తెలియజేసింది.

‘‘యూజర్‌ ఇచ్చిన ప్రాంప్ట్‌ ఆధారంగా హై డీటెయిల్స్‌ కలిగిన 60 సెకన్ల వీడియోను సోరా రూపొందించగలదు. కెమెరా మోషన్లతో సహా వివిధ క్యారెక్టర్లను కూడా ఇది రూపొందిస్తుంది’’ అని ఓపెన్‌ఏఐ పేర్కొంది. గూగుల్‌ లూమియర్‌, రన్‌వే ఏఐ, పికా 1.0 వంటివి ఇప్పటికే టెక్ట్స్‌-టు-వీడియో జనరేటర్లను తీసుకొచ్చాయి. అయితే, ఇవేవీ 5 సెకన్లకు మించి వీడియోలను జనరేట్‌ చేయలేవు. వాటితో పోలిస్తే ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన జనరేటర్‌ దాదాపు 10 రెట్లు అధిక నిడివి కలిగిన వీడియోను జనరేట్‌ చేస్తుండడం గమనార్హం.

పేటీఎంకు మరో షాక్‌.. ఫాస్టాగ్‌ జారీ నిలిపివేత!

సోరా జనరేట్‌ చేసిన పలు వీడియోలను ఓపెన్‌ఏఐ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. పలువురు యూజర్లు ఇచ్చిన ప్రాంప్ట్‌, దానికి సోరా రూపొందించిన వీడియోలను కంపెనీ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ పోస్ట్‌ చేశారు. స్టిల్‌ ఇమేజ్‌ పోస్ట్‌ చేసినా దాన్నుంచి వీడియో రూపొందించగలదని ఓపెన్‌ఏఐ పేర్కొంది. ఇందులో కొన్ని లోపాలూ ఉన్నాయని ఆ సంస్థే స్వయంగా అంగీకరించింది. కొన్ని సందర్భాలను ఈ వీడియో జనరేటర్‌ సరిగా అర్థం చేసుకోలేకపోతోందని పేర్కొంది. ఉదాహరణకు ఒక వ్యక్తి బిస్కెట్‌ను కొరికిన తర్వాత ఆ మార్కును బిస్కెట్‌పై చూపించకపోవడం వంటి లోపాలను తాము గుర్తించినట్లు పేర్కొంది.

మరోవైపు డీప్‌ఫేక్‌ వీడియోలను రూపొందించడానికి వీల్లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. తప్పుదోవ పట్టించే వీడియోలను రూపొందించడానికి వీల్లేకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. అందుకే ప్రస్తుతానికి రెడ్‌టీమర్లు, సైబర్‌సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌లు, కొందరు కంటెంట్‌ క్రియేటర్లకు మాత్రమే దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఓపెన్‌ ఏఐ తెలిపింది. ఓపెన్‌ ఏఐ ప్రొడక్ట్‌గా ప్రజల్లోకి తీసుకొచ్చే ముందు భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని కంపెనీ పేర్కొంది.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని