Credit Card: ఈ క్రెడిట్‌ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!

Credit Card: ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులకు కూడా దాన్ని విస్తరించేందుకు క్రమంగా సిద్ధమవుతున్నాయి.

Published : 29 Apr 2024 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్తు, ఫోన్‌, గ్యాస్‌, ఇంటి అద్దె వంటి యుటిలిటీ బిల్లులు క్రెడిట్‌ కార్డుతో (Credit Card) చెల్లిస్తే ఒకప్పుడు సంస్థలు రివార్డులు ఇచ్చేవి. క్రమంగా పరిస్థితి మారుతోంది. అద్దెపై ఇప్పటికే సేవా రుసుము వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇతర బిల్లులకూ దీన్ని వర్తింపజేసేందుకు కొన్ని బ్యాంకులు సిద్ధమయ్యాయి.

యెస్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు 2024 మే 1 నుంచి క్రెడిట్‌ కార్డులతో (Credit Card) చెల్లించే యుటిలిటీ బిల్లులపై 1 శాతం రుసుము వసూలుచేయనున్నాయి. ఉదాహరణకు రూ.1,500 విద్యుత్తు బిల్లు యెస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌ కార్డుతో చెల్లిస్తే రూ.15 రుసుము అదనంగా భరించాల్సి ఉంటుంది.

ఇది అందరికీ వర్తించదు. యెస్‌ బ్యాంకులో అయితే నెలవారీ యుటిలిటీ బిల్లుల (Utility Bills) విలువ రూ.15,000 దాటితే ఒక శాతం అదనపు రుసుము వర్తిస్తుంది. అంటే ఫోన్‌, విద్యుత్తు, టీవీ, అద్దె ఇలా వివిధ యుటిలిటీ బిల్లుల చెల్లింపు మొత్తం రూ.15 వేలు దాటిందనుకుందాం. తర్వాత కూడా మళ్లీ ఏదైనా యుటిలిటీ బిల్లు చెల్లించాల్సి వస్తే అదనపు ఫీజు తప్పదు. ఐడీఎఫ్‌సీ బ్యాంకు విషయంలో ఈ పరిమితి రూ.20వేలుగా ఉంది.

ఎందుకంటే..

తక్కువ ఎండీఆర్‌..

క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై పేమెంట్‌ గేట్‌వేలు వ్యాపారస్థుల నుంచి వసూలుచేసే ఛార్జ్‌ను ‘మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్ (MDR)’ అంటారు. నిత్యావసరాలు, ట్రావెల్‌.. ఇలా కేటగిరీని బట్టి ఇది మారుతుంది. యుటిలిటీ బిల్లుల (Utility Bills) చెల్లింపులపై ఎండీఆర్‌ చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా బ్యాంకులకు తక్కువ ఆదాయం వస్తోంది. దీన్ని సర్దుబాటు చేసుకునేందుకు ప్రత్యేక రుసుము వసూలు చేయనున్నాయి.

దుర్వినియోగాన్ని అరికట్టేందుకు..

కొంతమంది వ్యాపార అవసరాల కోసం క్రెడిట్‌ కార్డులను (Credit Card) దుర్వినియోగపరుస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా క్రెడిట్‌ లిమిట్‌తో పోలిస్తే యుటిలిటీ బిల్లుల మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యాపార అవసరాలను సైతం యుటిలిటీ బిల్లుల కింద చూపి ప్రయోజనం పొందుతున్నారు. దీన్ని నివారించడం కూడా అదనపు రుసుము విధించడం వెనక ఉన్న ఓ కారణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని