Paytm: పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు.. జోక్యం చేసుకోలేమన్న కేంద్రం..!

Paytm: పేటీఎంపై ఆర్‌బీఐ విధించిన ఆంక్షల వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.

Updated : 07 Feb 2024 11:33 IST

దిల్లీ: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై (PPBL) ఆర్‌బీఐ (RBI) ఆంక్షలు విధించడంతో వాటి నుంచి బయటపడేందుకు కంపెనీ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ (Vijay Shekhar Sharma) కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. మంగళవారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)తో సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కేవలం 10 నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకునేది ఏమీ లేదని ఆర్థిక మంత్రి  చెప్పినట్లు సమాచారం. ఆర్‌బీఐతోనే సమస్యను పరిష్కరించుకోవాలని, వారి మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్మలమ్మ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు, రెగ్యులేటరీ ఆంక్షలపై చర్చించేందుకు ఆర్‌బీఐ అధికారులతోనూ విజయ్‌ శర్మ సమావేశమైనట్లు సమాచారం.

పేటీఎం మీద ఈడీ దర్యాప్తు జరగట్లేదు

పేటీఎం (Paytm)కు చెందిన పేమెంట్స్‌ బ్యాంక్‌కు ఇటీవల ఆర్‌బీఐ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత ఏ కస్టమర్‌, ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌, వ్యాలెట్‌, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు చేపట్టకూడదని ఆదేశించింది. సమగ్ర సిస్టమ్‌ ఆడిట్‌, బయటి ఆడిటర్ల నివేదికలను అనుసరించి ఈ చర్యలు తీసుకుంది. బ్యాంక్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించామని ఆర్‌బీఐ పేర్కొంది.

అటు.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)పై తాజాగా విధించిన ఆంక్షలకు సంబంధించిన నివేదికను ఇవ్వాల్సిందిగా ఆర్‌బీఐను ఈడీ, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ)లు కోరాయి. ఈ పరిణామాలతో ఇటీవల కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. మరోవైపు, పేటీఎంపై ఆంక్షలు వెనక్కి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని పలు ప్రముఖ అంకుర సంస్థల వ్యవస్థాపకులు ప్రభుత్వానికి లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని