పేటీఎం మీద ఈడీ దర్యాప్తు జరగట్లేదు

ప్రస్తుతమైతే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌  మీద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు జరగడం లేదని రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా తెలిపారు.

Published : 07 Feb 2024 01:28 IST

రెవెన్యూ కార్యదర్శి స్పష్టత
ఆర్‌బీఐ నుంచి నివేదిక కోరిన ఈడీ, ఎఫ్‌ఐయూ

దిల్లీ: ప్రస్తుతమైతే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌  మీద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు జరగడం లేదని రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా తెలిపారు. పేటీఎం మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లుగా మీడియా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ స్పష్టతను ఇవ్వడం గమనార్హం. ‘ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలు తీసుకుంటాయి. ప్రస్తుతానికి అటువంటిదేమీ జరగడం లేద’ని ఓ ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మల్హోత్రా తెలిపారు. పేటీఎం కూడా తమపై వచ్చిన మనీలాండరింగ్‌ ఆరోపణలను తోసిపుచ్చుతూ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. మరో వైపు, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)పై తాజాగా విధించిన ఆంక్షలకు సంబంధించిన నివేదికను ఇవ్వాల్సిందిగా ఆర్‌బీఐను ఈడీ, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ)లు కోరాయి. ఈ నివేదిక ఆధారంగా పీపీబీఎల్‌పై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందా? లేదా అనే విషయాన్ని పరిశీలిస్తామని ఈడీ తెలిపినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చర్చలు: ఆర్‌బీఐ విధించిన ప్రస్తుత ఆంక్షల నుంచి బయటపడేందుకు పేటీఎం మార్గాలను అన్వేషిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

వాటాలు పెంచుకున్నాక.. పతనం: డిసెంబరు త్రైమాసికంలో పేటీఎమ్‌లో దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ల వాటా అంతకుముందు త్రైమాసికంలోని 2.79 శాతం నుంచి 4.99 శాతానికి పెరిగింది. ఎఫ్‌ఐఐల వాటా 2.8 శాతం మేర పెరిగి 63.72 శాతానికి, చిన్న మదుపర్ల వాటా 4.57 శాతం మేర పెరిగి 12.85 శాతానికి చేరింది. ఇలా వీళ్లు వాటాలను పెంచుకున్నాక నెలల వ్యవధిలోనే పేటీఎం షేర్లు భారీగా పతనమవ్వడం గమనార్హం. ఈ ప్రభావం చిన్న మదుపర్లపై ఎక్కువగానే కనిపించింది. ఇలాంటి వారి సంఖ్య సుమారు 11 లక్షల మంది ఉండొచ్చని అంచనా.

పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో వినియోగదారులు ఇతర పేమెంట్‌ యాప్‌లైన ఫోన్‌ పే, భీమ్‌-యూపీఐ, గూగుల్‌ పే వైపు మొగ్గుచూపుతున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ ఒక్కరోజే ‘ఫోన్‌ పే’ను 2.79 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు ‘యాప్‌ ఫిగర్స్‌’ వెల్లడించింది. 

పుంజుకున్న పేటీఎం షేర్లు: వరుస మూడు రోజుల పతనం అనంతరం పేటీఎం షేర్లు పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో 3.02% లాభంతో రూ.451.60 వద్ద ముగిసింది. గత మూడు ట్రేడింగ్‌ రోజుల్లో పేటీఎం షేరు 42% మేర పతనమై, రూ.20,471.25 కోట్ల మేర మార్కెట్‌ విలువ ఆవిరయ్యింది. అయితే షేరు పుంజుకోవడంతో రూ.822.78 కోట్ల మార్కెట్‌ విలువ పెరిగింది.


చిన్న మదుపర్లు కొనుగోళ్లకు దూరంగా ఉండాలి

పేటీఎం షేరు ఒకవేళ పుంజుకున్నప్పటికీ... కంపెనీపై నియంత్రణపరమైన అనిశ్చితుల కారణంగా మున్ముందు ఎంత మేర షేరు పెరుగుతుందనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి అంచనాకు విశ్లేషకులు రాలేకపోతున్నారు. ఐపీఓ ధరతో (రూ.2,150) పోలిస్తే ప్రస్తుతం పేటీఎం షేరు 75 శాతం మేర పతనమైంది. పేటీఎం షేర్లు భారీగా పతనమైన నేపథ్యంలో తక్కువ స్థాయిల వద్ద షేరును కొనుగోలు చేసే విషయంలో చిన్న మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. పూర్తి స్పష్టత వచ్చే వరకు షేరుకు దూరంగా ఉండటమే మేలని చెబుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని