Paytm ఎఫెక్ట్‌.. పెరిగిన ఫోన్‌ పే, భీమ్‌ యాప్‌ డౌన్‌లోడ్స్‌

Paytmపై ఆంక్షల కారణంగా ఫోన్‌ పే, భీమ్‌-యూపీఐ, గూగుల్‌ పే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునే వారి సంఖ్య పెరిగింది.

Updated : 06 Feb 2024 17:14 IST

దిల్లీ: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై (PPBL) భారతీయ రిజర్వు బ్యాంక్‌ (RBI) ఆంక్షలు విధించిన నేపథ్యంలో వినియోగదారులు ఇతర పేమెంట్‌ యాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఫోన్‌ పే (PhonePe), భీమ్‌-యూపీఐ (BHIM-UPI), గూగుల్‌ పే (Google Pay) డౌన్‌లోడ్స్‌ గణనీయంగా పెరిగాయి. ఫిబ్రవరి 3వ తేదీ ఒక్కరోజే ‘ఫోన్‌ పే’ను 2.79 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ‘యాప్‌ ఫిగర్స్‌’ (App Figures) సంస్థ వెల్లడించింది. గత వారంతో పోలిస్తే ఇది 45 శాతం పెరుగుదలని తెలిపింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 మధ్య మొత్తంగా 10.4 లక్షల డౌన్‌లోడ్స్‌ జరిగాయని నివేదికలో పేర్కొంది. 

వినియోగదారులు, వ్యాపారులను ఆకర్షించేందుకు కొంతకాలంగా ఫోన్‌ పే మార్కెటింగ్‌లో కొత్త విధానాలను అవలంబిస్తోంది. దీంతో గూగుల్‌ ప్లేస్టోర్‌ (Google PlayStore), యాపిల్‌ యాప్‌ స్టోర్‌ (Apple App Store)లో ఉచిత యాప్‌ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. తాజా గణాంకాల ప్రకారం జనవరి 31 నాటికి ప్లేస్టోర్‌లో ‘ఫోన్‌ పే బిజినెస్’ యాప్‌ 188వ స్థానంలో ఉండగా.. ఫిబ్రవరి 5న 33వ స్థానానికి చేరుకుంది. యాప్‌ స్టోర్‌లో 227 నుంచి 72కి ఎగబాకింది. 

పేటీఎంను కనికరించండి.. ప్రభుత్వానికి స్టార్టప్‌ల లేఖ!

నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI)కి చెందిన భీమ్‌-యూపీఐ యాప్‌ డౌన్‌లోడ్స్‌ కూడా 50 శాతం మేర పెరిగాయి. జనవరి 19న ప్లేస్టోర్‌లో 326 స్థానంలో ఉండగా.. ఫిబ్రవరి 5వ తేదీకి ఏడో స్థానంలో నిలిచింది. గూగుల్‌ పే యాప్‌ను జనవరి 31- ఫిబ్రవరి 3 మధ్య ప్లేస్టోర్‌లో 3.95 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆర్‌బీఐ ఆంక్షల వల్ల పొదుపు ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్, ఎన్‌సీఎంసీ ఖాతాల్లో ఉన్న డిపాజిట్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని పేటీఎం స్పష్టంచేసింది. ఫిబ్రవరి 29 తర్వాత యాప్‌ పనిచేస్తుందని తెలిపింది. కానీ, ఈ ప్రకటన మదుపరులతోపాటు, ఖాతాదారుల్లో విశ్వాసాన్ని నింపలేకపోయింది. మరోవైపు పేటీఎంపై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని పలు అంకుర సంస్థల వ్యవస్థాపకులు ప్రభుత్వానికి లేఖ రాశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని