Paytm: పేటీఎంను కనికరించండి.. ప్రభుత్వానికి స్టార్టప్‌ల లేఖ!

Paytm: పీపీబీఎల్‌పై విధించిన ఆంక్షలను అత్యంత కఠినమైనవిగా పేర్కొన్న పలు స్టార్టప్‌ల వ్యవస్థాపకులు ప్రభుత్వానికి లేఖ రాశారు.

Updated : 06 Feb 2024 13:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై (PPBL) ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో పలు ప్రముఖ అంకుర సంస్థల వ్యవస్థాపకులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆంక్షలను వెనక్కి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే ఫిన్‌టెక్‌ రంగానికి ప్రతికూల సంకేతాలు వెళ్తాయని ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ సహా ఆర్‌బీఐకి (RBI) రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఇన్నోవ్‌8, క్యాపిటల్‌మైండ్‌, భారత్‌ మ్యాట్రిమోనీ సహా మరికొన్ని ప్రముఖ స్టార్టప్‌ల వ్యవస్థాపకులు సంతకం చేసినట్లు సమాచారం. 

పీపీబీఎల్‌పై తాజాగా విధించిన ఆంక్షల పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. దీని ప్రభావం పేటీఎం (Paytm) వెలుపలా ఉండే ప్రమాదం ఉందని తెలిపారు. ఆర్‌బీఐ (RBI) చర్యలను అత్యంత కఠినమైనవిగా అభివర్ణించిన వారు.. వాటి తీవ్రత తగ్గించే అంశాన్నైనా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సంస్థతో సంప్రదింపులు జరిపి లోపాలను సవరించుకునే అవకాశం కల్పించాలని విన్నవించారు. లేదంటే ఇతర ఫిన్‌టెక్‌ కంపెనీలూ ప్రతికూల ప్రభావాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు.

మేం కొనడం లేదు: జియో

మరోవైపు పేటీఎం వాలెట్‌ (Paytm Wallet) వ్యాపారాన్ని కొనుగోలు చేయనున్నట్లు వస్తున్న వార్తల్ని జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఖండించింది. ఈ మేరకు సోమవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. నిబంధనల ప్రకారం.. అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తామే స్వయంగా వెల్లడిస్తామని చెప్పింది. పేటీఎం సైతం తాము ఎవరితోనూ వ్యాపార అమ్మకాల నిమిత్తం చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది.

కాస్త పుంజుకున్న షేర్లు..

వరుసగా మూడురోజుల పాటు లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ముగిసిన పేటీఎం షేర్లు (Paytm Share price) మంగళవారం కాస్త పుంజుకున్నాయి. ఉదయం 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ వద్దే ప్రారంభమైన షేరు రూ.395 దగ్గర జీవనకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. కానీ, ఈరోజు బ్లాక్‌ డీల్ ద్వారా పెద్ద ఎత్తున షేర్లు చేతులు మారినట్లు వార్తలు రావటంతో పుంజుకున్నాయి. ఉదయం 11:07 గంటల సమయంలో బీఎస్‌ఈలో కంపెనీ షేరు 1.83 శాతం లాభపడి రూ.446.35 దగ్గర ట్రేడవుతోంది.

పీపీబీఎల్‌పై RBI ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 2024 ఫిబ్రవరి 29 నుంచి డిపాజిట్లను స్వీకరించొద్దని ఆదేశించింది. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు కూడా చేయొద్దని తెలిపింది. పీపీబీఎల్‌ కార్యకలాపాలపై బయటి ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్‌ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, లోపాలు ఉన్నాయని ఆడిట్‌లో తేలినందునే సంస్థపై మరింతగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సి వస్తోందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని