Paytm lays off: పేటీఎంలో ఉద్యోగ కోతలు.. సంఖ్యపై రాని స్పష్టత!

Paytm lays off: పేటీఎం సంస్థ ఉద్యోగులను ఇంటికి పంపింది. వారికి చెల్లించాల్సిన బోనస్‌లను కూడా విడుదల చేసింది.

Updated : 10 Jun 2024 13:27 IST

Paytm lays off | దిల్లీ: పేటీఎం (Paytm) బ్రాండ్‌పై ఆర్థిక సేవలను అందిస్తున్న వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని (Paytm lays off) తొలగించింది. ఎంతమందిని తొలగించిందీ మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. వారు వేరే సంస్థల్లో ఉద్యోగం సాధించడంలో తాము సాయపడుతున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఉద్యోగ కోతలు చేపట్టాల్సి వచ్చింది. ఉద్యోగ విరమణ చేసిన వారికి వేరే సంస్థలో ఉద్యోగ కల్పించడంలో తోడ్పడుతున్నాం. మా హెచ్‌ఆర్‌ టీమ్‌ 30 సంస్థలతో కలిసి పనిచేస్తోంది’’ అని పేటీఎం పేర్కొంది.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీని పెంచిన ఎయిర్‌టెల్‌

2024 మార్చి నాటికి పేటీఎంలో 36,521 మంది పనిచేస్తున్నారు. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఈ సంఖ్య 3,500 వరకు తగ్గింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై.. రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యల నేపథ్యంలో పేటీఎం ఉద్యోగ కోతలు చేపట్టింది. ఇప్పుడు మరోసారి ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న బోనస్‌లను సైతం పేటీఎం విడుదల చేసింది. పారదర్శకంగా లేఆఫ్‌ల ప్రక్రియ చేపడుతున్నట్లు కంపెనీ పేర్కొంది. పేటీఎం పేమెట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో కంపెనీ నష్టాలు పెరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.167.5 కోట్ల నష్టాలను ప్రకటించిన ఆ సంస్థ.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికంలో నష్టం రూ.550 కోట్లకు పెరిగింది. దీంతో ఫలితాల వెల్లడి సమయంలోనే ఉద్యోగ కోతలుంటాయని సంకేతాలు ఇచ్చింది. ఏఐ వినియోగాన్ని పెంచి తద్వారా పరిమిత సంఖ్యలో ఉద్యోగులతో కొనసాగాలని నిర్ణయానికొచ్చింది. కంపెనీని లాభదాయకతలోకి తీసుకురావడంపై పనిచేస్తున్నట్టు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు