Paytm Loss: రూ.550 కోట్లకు పెరిగిన పేటీఎం నష్టం

Paytm Loss: మార్చితో ముగిసిన త్రైమాసికంలో పేటీఎం నష్టం మరింత పెరిగింది. మొత్తంగా 2022-23లో మాత్రం తగ్గినట్లైంది.

Published : 22 May 2024 11:54 IST

దిల్లీ: పేటీఎం బ్రాండ్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక సేవల సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ నష్టం (Paytm Loss) మరింత పెరిగింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నష్టాలు రూ.550 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే మూడు నెలల వ్యవధిలో రూ.167.5 కోట్ల నష్టాన్ని నివేదించింది.

పేటీఎం (Paytm) కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం జనవరి-మార్చి త్రైమాసికంలో 2.8 శాతం కుంగి రూ.2,267.1 కోట్లుగా నమోదైంది. 2022-23లో ఇది రూ.2,464.6 కోట్లుగా ఉంది. మొత్తంగా 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టం వార్షిక ప్రాతిపదికన రూ.1,776.5 కోట్ల నుంచి రూ.1,422.4 కోట్లకు తగ్గింది. ఆదాయం 25 శాతం పెరిగి రూ.9,978 కోట్లకు చేరింది.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై (PPBL) ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలోకి డిపాజిట్లు, టాపప్‌లు సహా ఎలాంటి క్రెడిట్‌ లావాదేవీలు నిర్వహించొద్దని ఆదేశించింది. పీపీబీఎల్‌పై ఆంక్షల వల్ల రూ.3,00-500 కోట్ల నష్టం వాటిల్లుతుందని పేటీఎం అప్పట్లో అంచనా వేసింది. కంపెనీ షేరు విలువ నేడు ఓ దశలో అరశాతం మేర కుంగి రూ.350 వద్ద ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని