2000 Note: మీ వద్ద ఇంకా ₹2 వేల నోట్లున్నాయా.. ఈ రెండు మార్గాల్లో మార్చుకోండి..

2000 Note Exchange:  2 వేల రూపాయల నోట్ల మార్పిడికి ఆర్‌బీఐ మరో రెండు మార్గాలను సూచించింది. ఈ పద్ధతుల్లో క్యూ లైన్‌లో నిలబడకుండా, ఆర్‌బీఐ కార్యాలయానికి వెళ్లకుండా నోట్లను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయొచ్చు.

Updated : 02 Nov 2023 18:16 IST

దిల్లీ: రెండు వేల రూపాయల నోట్ల (2000 Note) మార్పిడికి గడువు అక్టోబరు 7తో ముగిసింది. అయితే, ఇప్పటికీ కొంతమంది వద్ద ఈ నోట్లు ఉండటంతో వాటిని మార్చేందుకు  తమ దగ్గర్లోని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రాంతీయ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ₹2 వేల నోట్ల మార్పిడికి మరో రెండు మార్గాలను ఆర్‌బీఐ సూచించింది. మొదటి విధానంలో తాము నివసించే ప్రాంతానికి దగ్గర్లో ఆర్‌బీఐ కార్యాలయం లేని వాళ్లు బీమా చేసిన పోస్ట్‌ (Insured Post) సర్వీసు ద్వారా నోట్లను ఆర్‌బీఐకి పంపొచ్చు. రెండో విధానంలో ఆర్‌బీఐ కార్యాలయానికి వెళ్లి క్యూలో నిలబడకుండా టీఎల్‌ఆర్‌ (TLR) ఫామ్‌ ద్వారా ₹2 వేల నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేసుకోవచ్చని తెలిపింది. 

‘‘ఇంకా రెండు వేల నోట్లు ఉన్నవాళ్లు వాటిని తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసేందుకు బీమా చేసిన పోస్ట్‌ ద్వారా ఆర్‌బీఐకి పంపొచ్చు. ఇది సురక్షితమైన పద్ధతి. దీనివల్ల ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ దగ్గర్లో ఆర్‌బీఐ కార్యాలయం ఉంటే క్యూలో నిలబడకుండా టీఎల్‌ఆర్‌ ఫామ్‌తో ₹2 వేల నోట్లను మార్చుకోవచ్చు’’ అని దిల్లీ ఆర్‌బీఐ రీజినల్‌ డైరెక్టర్‌ రోహిత్‌ పి దాస్‌ తెలిపారు. 

ఏప్రిల్‌ నుంచి ‘హలో! యూపీఐ’.. వాయిస్‌ కమాండ్‌తోనే లావాదేవీలు!

టీఎల్ఆర్‌ ఫామ్‌ను ఆర్‌బీఐ కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్‌ వద్ద పొందొచ్చు. ఫామ్‌పై బ్యాంకు ఖాతా వివరాలు, నోట్ల సంఖ్యను రాసి టీఎల్‌ఆర్‌ ఫామ్‌ డిపాజిట్ బాక్సులో వేయాలి. తర్వాత ఆర్‌బీఐ సిబ్బంది వాటిని ఆయా వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇక పోస్ట్‌ ద్వారా పంపే కవర్‌లో నోట్లతోపాటు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన ఫామ్‌ను జతచేసి (ఈ ఫామ్‌ను ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు) ఇన్సూరెన్స్ చేసి ఆర్‌బీఐ కార్యాలయానికి పంపొచ్చు.

వీటితోపాటు వ్యక్తిగతంగా ఆర్‌బీఐ కార్యాలయంలోని కౌంటర్‌ వద్ద రూ.20 వేల విలువైన నోట్లను మార్చుకోవచ్చు. గతంలో నోట్ల మార్పిడికి ఆర్‌బీఐ ఇచ్చిన గడువు అక్టోబరు 7తో ముగిసింది. అక్టోబరు 8 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ₹2 వేల నోట్ల మార్చుకునేందుకు అనుమతించింది. ఇప్పటి వరకు 97 శాతం నోట్లు తిరిగి వచ్చాయని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని