గూగుల్‌ ప్లేకు పోటీగా ఇండస్‌ యాప్‌స్టోర్‌.. యూజర్లకు లైవ్‌లోకి

 Indus Appstore: గూగుల్‌ ప్లేకు పోటీగా ఫోన్‌పే ఇండస్‌ యాప్‌స్టోర్‌ను ప్రారంభించింది. యూజర్లు యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అందుబాటులోకి తెచ్చింది.

Published : 21 Feb 2024 22:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాల్‌మార్ట్‌కు చెందిన డిజిటల్‌ పేమెంట్‌ సంస్థ ఫోన్‌పే (Phone) ఇండస్‌ యాప్‌స్టోర్‌ను (Indus Appstore) లాంచ్‌ చేసింది. గూగుల్‌ ప్లే స్టోర్‌కు పోటీగా దీన్ని తీసుకొచ్చింది. ‘ఇండియా కా యాప్‌ స్టోర్‌’గా ఫోన్‌పే పేర్కొంటోంది. దిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చేతులమీదుగా ఈ యాప్‌ స్టోర్‌ ప్రారంభమైంది. 12 ప్రాంతీయ భాషల్లో యాప్‌స్టోర్‌ అందుబాటులో ఉంటుంది. దీంతో నచ్చిన భాషలో సెర్చ్‌ చేసి యాప్స్‌ పొందొచ్చు.

ఇండస్‌ యాప్‌స్టోర్‌ను తీసుకొస్తున్నట్లు ఫోన్‌పే ఇదివరకే ప్రకటించింది. తొలుత ఆండ్రాయిడ్ డెవలపర్ల కోసం గతేడాది అందుబాటులోకి తెచ్చింది. తాజాగా సామాన్య యూజర్లు సైతం దీన్ని వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. 45 కేటగిరీలకు చెందిన 2 లక్షల మొబైల్‌ అప్లికేషన్లను తమ యాప్‌స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్‌ చేయడానికి 2025 ఏప్రిల్‌ 1 వరకు ఎలాంటి ఫీజూ వసూలుచేయబోమని పేర్కొంది. నచ్చిన థర్డ్‌ పార్టీ పేమెంట్‌ గేట్‌వేలు కూడా వాడుకోవచ్చని తెలిపింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ పాలసీలు, కమీషన్‌ విషయంలో స్టార్టప్‌లు ఆందోళన వ్యక్తంచేస్తున్న వేళ ఈ యాప్‌స్టోర్‌ను తీసుకురావడం గమనార్హం.

ప్రస్తుతం ఇండస్‌ యాప్‌స్టోర్‌ యాప్‌.. కంపెనీ వెబ్‌సైట్‌ (indusappstore.com)లో అందుబాటులో ఉంది. అక్కడి నుంచి నేరుగా ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైల్‌ మేనేజర్‌లోకి వెళ్లి ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్‌ చేయాల్సి ఉంటుంది. అందుకు కావాల్సిన పర్మిషన్లు ఇచ్చాక యాప్‌ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అవుతుంది. మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా లాగిన్‌ అవ్వొచ్చు. ఆపై మీకు నచ్చిన యాప్‌ను స్టోర్‌నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని