Bajaj CNG bike: పెట్రోల్‌ vs ఈవీ రేస్‌.. CNG బైక్‌తో బజాజ్‌ చెక్‌ పెట్టనుందా?

Bajaj CNG bike: బజాజ్ నుంచి త్వరలో సీఎన్‌జీతో నడిచే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా బజాజ్‌ ఎండీ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని సూచన ప్రాయంగా పేర్కొన్నారు.

Updated : 19 Sep 2023 20:24 IST

ఇంటర్నెట్ డెస్క్: సీఎన్‌జీతో నడిచే కార్లు, ఆటోలు మనం నిత్యం రోడ్లపై చూస్తునే ఉన్నాం. ద్విచక్ర వాహనాల విషయానికొస్తే అయితే పెట్రోల్‌ లేదా ఈవీలే దర్శనమిస్తుంటాయి. ఇకపై రోడ్లపై సీఎన్‌జీతో నడిచే బైక్‌లు కూడా చూడబోతున్నామా? మార్కెట్లోకి ఈ తరహా బైక్‌లు రాబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ దీని గురించి తాజాగా ఓ హింట్‌ ఇచ్చారు. ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించారు.

ప్రస్తుతం 100 సీసీ సెగ్మెంట్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోందని రాజీవ్‌ బజాజ్‌ అన్నారు. రాబోయే పండగ సీజన్‌లో సైతం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఎంచుకుంటారనడంలో సందేహం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం 100-125 సీసీ సెగ్మెంట్‌లో బజాజ్‌ ఏడు మోటార్‌ సైకిళ్లను విక్రయిస్తోంది. పెరిగిన పెట్రోల్‌ ధరలు, కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోవడం వంటి కారణాలతో ఇప్పటికీ ఈ సెగ్మెంట్‌లో విక్రయాలు కొవిడ్‌ మునుపటి స్థాయికి రాలేదని గుర్తుచేశారు. త్వరలో పల్సర్‌ మోటార్‌ సైకిల్‌కు ఆరు కొత్త అప్‌గ్రేడ్స్‌తో పాటు, అతిపెద్ద పల్సర్‌ ఈ ఆర్థిక సంవత్సరంలోనే రానుందని చెప్పారు.

జియో ఎయిర్‌ఫైబర్‌ వచ్చేసింది.. ప్లాన్లు, ఫీచర్లివే..!

సీఎన్‌జీతో నడిచే స్కూటర్లు, మోటార్‌ సైకిళ్లు ఎందుకు ఉండదకూడదని ఈ సందర్భంగా రాజీవ్‌ ప్రస్తావించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలపై వాహనదారులు మొగ్గు చూపుతున్నప్పటికీ.. భద్రత, రేంజి, ఛార్జింగ్‌, బ్యాటరీ లైఫ్‌ పట్ల ఇప్పటికీ ఆందోళన ఉందన్నారు. అలాంటి వారికి సీఎన్‌జీ బైక్స్‌ ఒక ఆప్షన్‌ కాగలదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సహకారంతో బజాజ్‌ కంపెనీనే సీఎన్‌జీ మోటార్‌ సైకిల్‌ తీసుకురావొచ్చని ఎందుకు అనుకూడదంటూ తన ప్రణాళికను బయటపెట్టారు. అలాగే, సీఎన్‌జీ వాహనాలపై జీఎస్టీ 18 శాతానికి తగ్గించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ప్రస్తుతం సీఎన్‌జీ త్రీవీలర్‌ సెగ్మెంట్‌లో బజాజ్‌కు 70 శాతం వాటా ఉంది. ఒకవేళ రాజీవ్‌ బజాజ్‌ చెప్పినట్లు సీఎన్‌జీ మోటార్‌ సైకిల్‌ వస్తే మార్కెట్‌లో సంచలనం సృష్టించడమే కాదు.. చమురు భారం కూడా దాదాపు 50 శాతం వరకు తగ్గనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని