Reliance Jio AirFiber: జియో ఎయిర్‌ఫైబర్‌ వచ్చేసింది.. ప్లాన్లు, ఫీచర్లివే..!

Reliance Jio AirFiber: జియో ఎయిర్‌ ఫైబర్‌ ఒక వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ అని చెప్పొచ్చు. ఇంట్లో ఎన్ని డివైజ్‌లనైనా వైఫై ద్వారా దీనికి కనెక్ట్‌ చేసుకోవచ్చు.

Updated : 19 Sep 2023 20:37 IST

Reliance Jio AirFiber: టెక్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్‌ జియో ఎయిర్‌ఫైబర్‌ (Reliance Jio AirFiber) ఈరోజు విడుదలైంది. దీన్ని వినాయక చవితి సందర్భంగా మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఆగస్టు 28న జరిగిన 46వ సాధారణ వార్షిక సమావేశంలో ప్రకటించింది. అప్పటి నుంచి టెక్‌ ప్రియుల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. ఫీచర్లు, ప్లాన్ల వంటి విషయాలపై చాలా ఆతృతగా వేచిచూశారు.

ఏంటీ జియో ఎయిర్‌ఫైబర్‌..

ఇది 5జీ ఆధారిత వైర్‌లెస్‌ వైఫై సర్వీస్‌. అత్యంత వేగంతో ఇల్లు, వ్యాపార అవసరాలకు ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైర్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ ప్రొవైడర్లకు ప్రత్యామ్నాయంగానే దీన్ని జియో తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న జియోఫైబర్‌ (Jio Fiber)తో దీన్ని పోల్చుకుని పొరబడే అవకాశం ఉంది. జియో ఫైబర్‌.. బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను అందిస్తోంది. అంటే ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుల్స్‌ ద్వారా ఇళ్లు, ఆఫీసులకు ఇంటర్నెట్‌ సేవలను చేరువ చేస్తోంది. తాజాగా తీసుకొచ్చిన జియో ఎయిర్‌ఫైబర్‌ (Jio AirFiber) మాత్రం ఎలాంటి కేబుల్స్‌, వైర్లు అవసరం లేకుండానే పనిచేస్తుంది. జియో ఎయిర్‌ ఫైబర్‌ (Jio AirFiber) డివైజ్‌ను ఆన్‌ చేయగానే ప్రత్యేక 5జీ రేడియో లింక్‌ ద్వారా దగ్గర్లోని టవర్‌ నుంచి సిగ్నల్స్‌ అందుకొని ఇంటర్నెట్‌ను అందిస్తుంది. అదీ బ్రాడ్‌బ్యాండ్‌ కంటే కూడా అధిక వేగంతో. సింపుల్‌గా చెప్పాలంటే జియో ఎయిర్‌ ఫైబర్‌ ఒక వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ అని చెప్పొచ్చు. ఇంట్లో ఎన్ని డివైజ్‌లనైనా దీనికి కనెక్ట్‌ చేసుకోవచ్చు.

జియో ఎయిర్‌ఫైబర్‌ ప్లాన్లు..

  • రూ.599- 30Mbps, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా, సన్‌ నెక్ట్స్‌ తదితర ఓటీటీలు లభిస్తాయి.
  • రూ.899- 100Mbps, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా, సన్‌ నెక్ట్స్‌ తదితర ఓటీటీలు లభిస్తాయి.
  • రూ.1199- 100Mbps, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు లభిస్తాయి.

జియో ఎయిర్‌ ఫైబర్‌ మ్యాక్స్‌ ప్లాన్స్‌..

  • రూ.1499- 300Mbps, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు లభిస్తాయి.
  • రూ.2499- 500Mbps, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు లభిస్తాయి.
  • రూ.3999- 1Gbps, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు లభిస్తాయి.

* ఈ ప్లాన్లు 6/12 నెలల సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. ప్లాన్‌ ధరకు జీఎస్టీ అదనం.

* ఇన్‌స్టలేషన్‌ ఛార్జీల కింద రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.

* 12 నెలల ప్లాన్‌ తీసుకున్నవారికి ఇన్‌స్టలేషన్‌ ఛార్జీ నుంచి మినహాయింపు లభిస్తుంది.

* మరిన్ని వివరాల కోసం జియో ఎయిర్‌ ఫైబర్‌ వెబ్‌సైట్‌ చూడగలరు.

ఏయే నగరాల్లో..

ప్రస్తుతానికి హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుణె నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దశలవారీగా ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు జియో తెలిపింది.  

జియో ఎయిర్‌ఫైబర్‌ ఫీచర్లు (Jio AirFiber Features)..

జియో ఎయిర్‌ఫైబర్‌లో అనేక ఫీచర్లున్నాయి (Jio AirFiber Features). 1 జీబీపీఎస్‌ వేగం (Jio AirFiber speed)తో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, వైఫై 6 సపోర్ట్‌ సహా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను జియో అందిస్తోంది. సెక్యూరిటీ ఫైర్‌వాల్‌ కూడా ఉంది. జియో ఎయిర్‌ఫైబర్‌ (Jio AirFiber)ను యాప్‌ సాయంతో యూజర్లు నియంత్రించవచ్చు. యాప్‌ ద్వారా కొన్ని వెబ్‌సైట్‌లను కూడా యూజర్లు బ్లాక్‌ చేయొచ్చు. సాధారణ రౌటర్‌ ఏర్పాటుకు అవసరమైనట్లుగా ఎయిర్‌ఫైబర్‌ ఇన్‌స్టలేషన్‌ కోసం సాంకేతిక నిపుణుల అవసరం ఉండదు. ప్లగ్‌ అండ్ ప్లే తరహాలో ఇది పనిచేస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని