Ramesh Kunhikannan: చంద్రయాన్‌-3 విజయంతో బిలియనీర్ల జాబితాలోకి.. ఎవరీ రమేశ్‌ కున్హికన్నన్‌..?

Ramesh Kunhikannan: చంద్రయాన్‌-3 విజయంతో ఆయనకు ఐశ్వర్యం వరించింది. ఫోర్బ్స్‌ విడుదల చేసిన తాజా బిలియనీర్ల జాబితాలో కర్ణాటకకు చెందిన రమేశ్‌ కున్హికన్నన్‌కు చోటు దక్కింది. ఇంతకీ ఎవరాయన?

Updated : 04 Apr 2024 15:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖిస్తూ గతేడాది భారత్‌ ప్రయోగించిన ‘చంద్రయాన్‌-3 (Chandrayaan-3)’ జాబిల్లి దక్షిణ ధ్రవంపై దిగ్విజయంగా దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ పేరు ప్రపంచమంతా మార్మోగింది. ఈ విజయం కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారవేత్తను బిలియనీర్‌గా చేసింది.  ఆయనే కేనెస్‌ టెక్నాలజీ వ్యవస్థాపకుడు రమేశ్‌ కున్హికన్నన్‌ (Ramesh Kunhikannan).

ఫోర్బ్స్‌ 2024 ప్రపంచ బిలియనీర్ల లిస్ట్‌ (Forbes Billionaires List)ను తాజాగా విడుదల చేశారు. ఇందులో భారత్‌ నుంచి 25 మంది తొలిసారిగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరిలో రమేశ్‌ ఒకరు. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం ఆయన నికర సంపద విలువ 1.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. చంద్రయాన్‌-3 ప్రయోగం తర్వాత ఆయన సంపద విలువ భారీగా పెరిగిందట.

అంబానీ 9.. అదానీ 17: ఫోర్బ్స్‌ 2024 సంపన్నుల జాబితా

ఎవరీ రమేశ్‌ కున్హికన్నన్‌..

కర్ణాటకకు చెందిన రమేశ్‌.. మైసూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. 1988లో ‘కేనెస్‌ టెక్నాలజీ’ పేరుతో ఎలక్ట్రానిక్‌ పరికరాల ఉత్పత్తి సంస్థను ప్రారంభించారు. 1996లో ఆయన భార్య సవిత కంపెనీలో చేరారు. ప్రస్తుతం ఆమె సంస్థ ఛైర్‌పర్సన్‌గా ఉండగా.. రమేశ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

గతేడాది ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 మిషన్‌లోని రోవర్‌, ల్యాండర్‌కు విద్యుత్‌ను సరఫరా చేసే ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ను కేనెస్‌ కంపెనీ అందించింది. ఆ ప్రయోగ విజయం తర్వాత స్టాక్‌ మార్కెట్లలో సంస్థ షేర్లు రాణించాయి. 2022 నవంబరులో లిస్ట్‌ అయిన విలువతో పోలిస్తే షేరు ధర దాదాపు మూడింతలు పెరిగింది. ఈ కంపెనీలో రమేశ్‌కు 64శాతం వాటాలున్నాయి. దీంతో ఆయన నికర సంపద ఒక్కసారిగా పెరిగి బిలియనీర్ల జాబితాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని