RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ ‘డబుల్‌’ బొనాంజా.. డివిడెండ్‌ కింద ₹2.11 లక్షల కోట్లు

RBI dividend payout: కేంద్రానికి డివిడెండ్‌ రూపంలో రూ.2.11 లక్షల కోట్లు చెల్లించేందుకు ఆర్‌బీఐ నిర్ణయించింది.

Published : 22 May 2024 16:51 IST

RBI dividend payout | ముంబయి: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తీపి కబురు అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.11 లక్షల కోట్లు డివిడెండ్‌గా (dividend payout) చెల్లించేందుకు నిర్ణయించింది. గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో ఆర్‌బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు ఈమేరకు సమావేశమై మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసే విషయమై ఆమోదం తెలిపారు.

2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ రూ.87,416 కోట్లు డివిడెండ్‌ రూపంలో చెల్లించింది. దీంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 140 శాతం అధికంగా డివిడెండ్‌ చెల్లిస్తుండడం గమనార్హం. ఈ ఏడాది రూ.75,000-1,20,000 కోట్ల మేర నిధులు బదిలీ చేస్తారని ఆర్థిక వేత్తలు అంచనా వేయగా.. అంతకుమించి చెల్లించేందుకు ఆర్‌బీఐ బోర్డు నిర్ణయించింది. ఆర్‌బీఐ ఇచ్చిన డివిడెండ్‌ వల్ల కేంద్రం తన ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి ఉపయోగపడనుంది. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో కంటిన్‌జెంట్‌ రిస్క్‌ బఫర్‌ లెవల్‌ను కూడా 6 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. 

‘ఏఐ’ని మనుషుల్లా చూడడం ఆపాలి: సత్య నాదెళ్ల

ఏటా ఆర్‌బీఐ మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌ రూపంలో చెల్లిస్తుంటుంది. పెట్టుబడులు, డాలరు నిల్వలపై విలువల మధ్య వ్యత్యాసం, కరెన్సీ ప్రింటింగ్‌ ఫీజు వంటి రూపాల్లో ఆర్‌బీఐకి ఆదాయం సమకూరుతుంటుంది. ఇందులో మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేస్తుంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సర తాత్కాలిక బడ్జెట్‌లో ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్ల రూపంలో ఖజానాకు రూ.1.02 లక్షల కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఒక్కటే అంచనాలకు మించి డివిడెండ్‌ ప్రకటించడమంటే ‘డబుల్‌’ బొనాంజా అనే చెప్పాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని