UPI lite: యూపీఐ లైట్‌ బ్యాలెన్స్‌ ఇక ఆటో లోడ్‌.. ఫాస్టాగ్‌కూ వర్తింపు

UPI lite: యూపీఐ లైట్‌లో కొత్త సదుపాయాన్ని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. లైట్‌, ఫాస్టాగ్‌లో ఆటోలోడ్‌ ఆప్షన్‌ రాబోతోంది.

Updated : 07 Jun 2024 14:23 IST

UPI lite | ముంబయి: చిన్న మొత్తాల్లో చేసే డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ లైట్‌లో (UPI lite) ఆటోమేటిక్‌గా సొమ్ములు లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రతిపాదించింది. దీనివల్ల ఈ విధానంలో చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఫాస్టాగ్‌కు (Fastag) కూడా ఇదే విధానాన్ని ఆర్‌బీఐ సూచించింది.

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI)కు చెందిన సులభతరమైన వెర్షనే ఈ యూపీఐ లైట్‌. వ్యాలెట్‌లా ఇది పనిచేస్తుంది. దీంతో చేసే చెల్లింపులకు పిన్‌ అవసరం లేదు. దీనిలో గరిష్ఠంగా రూ.2000 వరకు లోడ్‌ చేసుకోవచ్చు. ఒకరోజులో రూ.2 వేలు మాత్రమే లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఒకసారి గరిష్ఠంగా రూ.500 మాత్రమే పేమెంట్‌ చేయగలం.

ఎఫ్‌డీ ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్‌.. ఇకపై రూ.3 కోట్ల వరకు రిటైల్‌ డిపాజిట్టే

ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడిలో భాగంగా యూపీఐ లైట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ ప్రకటించారు. దీని వినియోగాన్ని మరింత విస్తృత పరిచేందుకు ఇ-మ్యాండేట్‌ విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇందులో నిర్దిష్ట లిమిట్‌ కంటే సొమ్ములు తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఫండ్స్‌ లోడ్‌ అవుతాయి. లిమిట్‌ను యూజర్లే సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

చిన్న చిన్న లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. రికరింగ్‌ పేమెంట్స్‌కు ఇ-మ్యాండేట్‌ వాడకం పెరిగిందని ఈ సందర్భంగా దాస్‌ చెప్పారు. ఇందులో భాగంగా ఫాస్టాగ్‌, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్‌ (NCMC) వంటి వాటికి కూడా ఆటో లోడ్‌ సదుపాయాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. యూజర్‌ సెట్‌ చేసుకున్న పరిమితి కంటే నిధులు తగ్గినప్పుడు ఇ-మ్యాండేట్‌ సదుపాయం ద్వారా ఆటోమేటిక్‌గా ఫండ్స్‌ లోడ్‌ అవుతాయి. దీనివల్ల ప్రయాణంలో అవరోధాలు ఉండబోవని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని