డిజిటల్‌ రుణాలపై ఆర్‌బీ‘ఐ’.. లోన్‌ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్‌

RBI on Digital loans: డిజిటల్‌ రుణాలపై ఆర్‌బీఐ దృష్టి సారించింది. లోన్‌ అగ్రిగేటర్ల కోసం త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానుంది.

Published : 08 Dec 2023 17:10 IST

ముంబయి: డిజిటల్ రుణాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) దృష్టి సారించింది. ఆయా రుణ ఉత్పత్తులను అందించే లోన్‌ అగ్రిగేటర్ల కోసం త్వరలో ఒక నిబంధనావళిని తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ఇందుకోసం ఫిన్‌ టెక్‌ రిపాజిటరీని ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ద్వైమాసిక పరపతి విధాన నిర్ణయాల వెల్లడి సందర్భంగా ప్రకటించారు. డిజిటల్ రుణాల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకొస్తున్నట్లు తెలిపారు.

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ వంటి ఆర్థిక సంస్థలు ఫిన్‌టెక్‌ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకుంటున్నాయని శక్తికాంత దాస్‌ అన్నారు. ఫిన్‌టెక్‌ ఎకో సిస్టమ్‌ను అర్థం చేసుకోవడంతో పాటు డిజిటల్‌ రుణాల్లో పారదర్శకత కోసం ఫిన్‌టెక్‌ రిపాజిటరీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ఆధ్వర్యంలో రిపాజిటరీని 2024 ఏప్రిల్‌ లేదా అంతకంటే ముందే తీసుకురానున్నట్లు చెప్పారు. ఆయా ఫిన్‌టెక్‌ సంస్థలు సంబంధిత సమాచారాన్ని రిపాజిటరీకి అందించాల్సి ఉంటుందన్నారు.

ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్‌ ఎండ్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌

బ్యాంకింగ్‌ రంగంలో రుణాలపై గత కొంతకాలంగా దృష్టి సారించింది. వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డు రుణాల విషయంలో రిస్క్‌ వెయిట్‌ను పెంచుతూ ఇటీవల ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు/ ఆర్థిక సంస్థలు ఆ మేర మూలధనాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎటువంటి తాకట్టూ అవసరం లేకుండా తీసుకునే అన్‌ సెక్యూర్డ్‌ రుణాలు పెరుగుతున్న వేళ ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఈ రిస్క్‌ వెయిట్‌ పెంపు గురించి మాట్లాడుతూ.. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకోలేం కదా’ అని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని