Redmi smartphones: 2 ఏళ్ల వారెంటీతో రెడ్‌మీ A2, A2+ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు ఇవే..

Redmi A2, Redmi A2+ smartphones details: A2, A2+ పేరుతో రెడ్‌మీ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. రెండేళ్ల వారెంటీతో ఈ ఫోన్లు వస్తున్నాయి.

Published : 19 May 2023 14:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: షావోమీ సబ్‌బ్రాండ్‌ రెడ్‌మీ (Redmi) ఎంట్రీ లెవల్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. రెడ్‌మీ ఏ2, ఏ2+ (Redmi A2, A2+) పేరిట ఈ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. వాటర్‌ డ్రాప్‌ స్టయిల్‌ నాచ్‌, లెదర్‌ ఫినిషింగ్‌, బిగ్‌ బ్యాటరీతో తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్లను రెడ్‌మీ లాంఛ్‌ చేసింది. పైగా ఈ ఫోన్లు రెండేళ్ల వారెంటీతో వస్తున్నాయి. ఇక ఈ ఫోన్ల ధర, విక్రయాలు, ఫీచర్లను చూద్దాం..

రెడ్‌మీ A2 మూడు వేరియంట్లలో లభిస్తుంది. 2జీబీ+32జీబీ వేరియంట్‌ ధర రూ.,5999గా కంపెనీ నిర్ణయించింది. 2జీబీ+64జీబీ వేరియంట్‌ ధరను రూ.6,499గానూ, 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధరను రూ.7,499గానూ కంపెనీ ప్రకటించింది. A2+ మోడల్‌ 4జీఈబీ+64జీబీ వేరియంట్‌లో మాత్రమే లభిస్తోంది. ఈ రెండు ఫోన్లూ బ్లాక్‌, లైట్‌ గ్రీన్‌, లైట్‌ బ్లూ రంగుల్లో లభిస్తాయి. మే 23 నుంచి అమెజాన్‌, ఎంఐ.కామ్‌, ఎంఐ హోమ్‌ స్టోర్లు, రిటైల్‌ స్టోర్లలో విక్రయించనున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.500 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.

స్పెసిఫికేషన్లు.. (Redmi A2, Redmi A2 specs)

ఈ రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌పై పనిచేస్తాయి. రెండిట్లోనూ 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. వీటిలో మీడియాటెక్‌ హీలియో జీ36 ప్రాసెసర్‌ను వినియోగించారు. వర్చువల్‌ ర్యామ్‌ సదుపాయం కూడా ఉంది. రెండిట్లోనూ వెనుకవైపు ఏఐ డ్యూయల్‌ కెమెరా ఇచ్చారు. ప్రధాన కెమెరా 8ఎంపీ ఉంటుంది. ముందు వైపు 5ఎంపీ కెమెరా ఇస్తున్నారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.

వైఫై, బ్లూటూత్‌, ఎఎఫ్‌ఎం రేడియో వంటి సదుపాయాలు ఉన్నాయి. 3.5 ఎంఎం జాక్‌ ఇస్తున్నారు. రెడ్‌మీ ఏ2+లో అదనంగా ఫింగర్‌ప్రింట్‌ స్కానింగ్‌ సదుపాయం ఉంది. రెండు వేరియంట్లకు ఇదొక్కటే తేడా. రెండిట్లోనూ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ అమర్చారు. ఇది 10W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఫోన్‌తో పాటే ఛార్జర్‌ను ఇస్తున్నారు. సింగిల్‌ ఛార్జ్‌తో స్టాండ్‌బై మోడ్‌లో 32 రోజుల పాటు ఫోన్‌ను వినియోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఎంట్రీ లెవల్‌లో స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నవారు వీటిని పరిశీలించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని