Reliance Jio: 5జీ ప్లాన్‌ ధరలు పెరగనున్నాయా? జియో క్లారిటీ

Reliance Jio: 5జీ ప్లాన్‌ ధరల పెంపుపై జియో స్పష్టతను ఇచ్చింది. అందుబాటు ధరలో టెలికాం సేవలు అందించడమే లక్ష్యమని వివరించింది.

Published : 31 Oct 2023 14:03 IST

Reliance Jio | ఇంటర్నెట్‌ డెస్క్: దేశంలో 5జీ టెలికాం సేవలు ప్రారంభమై ఏడాది కావస్తోంది. చాలా వరకు నగరాలు, పట్టణాల్లో ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ సర్వీసులను ఆయా టెలికాం కంపెనీలు ఉచితంగానే అందిస్తున్నాయి. వొడాఫోన్‌ 5జీ సర్వీసులను ఇంకా ప్రారంభించాల్సి ఉంది. అయితే, 5జీ కోసం పెద్దఎత్తున వెచ్చించిన కంపెనీలు.. 5జీ టారిఫ్‌ ధరలను పెంచే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాన్‌ ధరల పెంపుపై తాజాగా జియో (Jio) క్లారిటీ ఇచ్చింది. 5జీ ప్లాన్‌ల ధరలను పెంచేది లేదని స్పష్టంచేసింది.

ఇతర టెలికాం కంపెనీలకు పోటీనిస్తూ అందుబాటు ధరలో వినియోగదారులకు టెలికాం సేవలు అందించడమే తమ లక్ష్యమని జియో తెలిపింది. ప్లాన్‌ ధరలను అనూహ్య స్థాయిలో ఇప్పట్లో పెంచే ఉద్దేశమేదీ లేదని జియో అధ్యక్షుడు మాథ్యూ ఊమెన్‌ పేర్కొన్నారు. కస్టమర్లను ఆకర్షించడమే తమ ఉద్దేశమని తెలిపారు. 20 కోట్ల మంది భారతీయులు ఇప్పటికీ 2జీ నెట్‌వర్క్‌పైనే ఆధారపడుతున్నారని, వారికి డిజిటల్‌ సేవలు అందించడమే జియో లక్ష్యమని వివరించారు. అందరూ డేటాను వినియోగించాలన్నదే ముకేశ్‌ అంబానీ అభిమతమని తెలిపారు. అధిక ధరల వల్ల ఆ లక్ష్యం నెరవేరదన్నారు.

రూపే క్రెడిట్‌ కార్డుతో ఈ ప్రయోజనాలు తెలుసా?

జియో ఇటీవల త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక యూజర్‌ నుంచి వస్తున్న సగటు ఆదాయం (ARPU) రూ.181.7గా అందులో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే స్వల్పంగానే ఈ మొత్తం పెరిగింది. అదే సమయంలో ఎయిర్‌టెల్‌ ఆర్పు రూ.200గా ఉండగా.. వొడాఫోన్‌ రూ.142గా ఉంది. టెలికాం కంపెనీలు తమ ఆదాయానికి దీన్నే కొలమానంగా తీసుకుంటాయి. ఆర్పు రూ.300కు చేరితేనే టెలికాం పరిశ్రమ ఆరోగ్యకరంగా ఉంటుందని ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విఠల్‌ ఓ సందర్భంలో తెలిపారు. ఈ విషయంలో వొడాఫోన్‌ పోటీ కంపెనీలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని