Rupay credit card: రూపే క్రెడిట్‌ కార్డుతో ఈ ప్రయోజనాలు తెలుసా?

Rupay credit card benefits: రూపే క్రెడిట్‌ కార్డులు విపరీతంగా ఆదరణ పొందుతున్నాయి. యూపీఐ చెల్లింపులకు వీటిని వినియోగించుకోవచ్చు. అంతేకాదు మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

Updated : 31 Oct 2023 12:44 IST

Rupay credit card | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు క్రెడిట్‌ కార్డు నెట్‌వర్కుల్లో మాస్టర్‌, వీసాలదే హవా. దేశీయంగా అభివృద్ధి చేసిన రూపే చాలాకాలం క్రితమే వచ్చినప్పటికీ.. ఆదరణ అంతంత మాత్రమే. కొన్ని నెలలుగా మాత్రం రూపే క్రెడిట్‌ కార్డులకు (Rupay credit card) అమాంతం డిమాండ్ పెరిగింది. యూపీఐ (UPI) చెల్లింపులకు రూపే క్రెడిట్ కార్డులను వినియోగించుకునేందుకు ఆర్‌బీఐ అనుమతివ్వడమే ఇందుక్కారణం. ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంకులూ ఈ కార్డులను జారీ చేస్తున్నాయి.

సాధారణంగా బ్యాంకు అకౌంట్ల నుంచి మాత్రమే యూపీఐ పేమెంట్స్‌ చేయడానికి వీలుంటుంది. క్రెడిట్ కార్డులను అనుసంధానం చేయడానికి వీల్లేదు. అదే మీ దగ్గర రూపే క్రెడిట్‌ కార్డులు ఉంటే యూపీఐ పేమెంట్స్‌ కోసం వినియోగించుకోవచ్చు. గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లోనైనా మీ క్రెడిట్‌ కార్డును అనుసంధానం చేసుకోవచ్చు. ఆపై ఎక్కడైనా స్కాన్‌ చేసి నేరుగా చెల్లింపులు చేయొచ్చు. వ్యక్తులకు పంపించడానికి, వ్యాలెట్‌ లోడింగ్‌కు మాత్రం అవకాశం లేదు. ఇంతకీ క్రెడిట్‌ కార్డును యూపీఐకి లింక్‌ చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చో ఇప్పుడు చూద్దాం..

ప్రయోజనాలు ఇవే..

  • యూపీఐతో రూపే క్రెడిట్‌ కార్డులను లింక్‌ చేయడం వల్ల పేమెంట్స్‌ సులభతరం అవుతాయి. ఒక చోట క్రెడిట్‌ కార్డు.. మరో చోట యూపీఐ యాప్‌ వినియోగించాల్సిన అవసరం ఉండదు. మీ చేతిలో ఫోన్‌ ఉంటే చాలు చెల్లింపులు చేయొచ్చు. ప్రతిసారీ కార్డును వెంట పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదు. 
  • సాధారణంగా క్రెడిట్‌ కార్డు చెల్లింపులపై రివార్డు పాయింట్లు వస్తాయి. ఖాతా ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి రివార్డులు ఉండవు. అదే రూపే క్రెడిట్‌ కార్డు ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై రివార్డు పాయింట్లనూ పొందొచ్చు.
  • పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (POS) కార్డు స్వైప్‌ మెషిన్లు లేని చిన్న చిన్న దుకాణాల్లోనూ యూపీఐ ద్వారా రూపే క్రెడిట్‌ కార్డులను వినియోగించుకోచ్చు. కొన్ని చోట్ల క్రెడిట్‌ కార్డులపై ఎండీఆర్‌ ఛార్జీలు విధిస్తుంటారు. ఇది 2 శాతం వరకు ఉంటుంది. రూపే క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపుల్లో ఇలాంటి సమస్య ఉత్పన్నం కాదు. 
  • మీ ఖర్చులను ట్రాక్‌ చేయడానికీ రూపే క్రెడిట్‌ కార్డు ఉపయోగపడుతుంది. మీ నెలవారీ ఖర్చుల కోసం ఒక పరిమితి పెట్టుకుని అంతవరకే చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. అదే అటు బ్యాంకు ఖాతాలు, ఇటు క్రెడిట్‌ కార్డును వినియోగించడం వల్ల ట్రాక్‌ చేయడం సాధ్యపడదు.
  • అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకు ఖాతాలో సొమ్ములు లేనప్పుడు రూపే క్రెడిట్‌ కార్డులు ఉపయోగపడతాయి. బిల్లు చెల్లింపులకు కాస్త గడువు ఉంటుంది కాబట్టి ఆ మేర వినియోగదారుడికి వెసులుబాటు లభిస్తుంది.
  • రూపే క్రెడిట్‌ కార్డులపై యాక్సిడెంటల్‌ కవరేజీ లభిస్తుంది. కార్డు రకం బట్టి కవరేజీ మొత్తం ఆధారపడి ఉంటుంది.

ఇదీ చూడాల్సిందే!: క్రెడిట్‌ కార్డు వాడకం విషయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. అదే యూపీఐకు లింక్‌ చేసే విషయంలో మరింత అప్రమత్తత అవసరం. యూపీఐ లావాదేవీలకు కార్డును లింక్‌ చేయడం ద్వారా అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఒకవేళ ఖర్చులపై నియంత్రణ లేనివారైతే రూపే క్రెడిట్‌ కార్డు మాత్రమే కాదు.. అసలు క్రెడిట్‌ కార్డు జోలికెళ్లకపోవడమే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని