Reliance Jio: ఆఫ్రికాలోకీ జియో ఎంట్రీ? భారత్‌ వ్యూహమే అక్కడా అమలు?

Reliance Jio: 5జీ సేవల అమలు కోసం ఆఫ్రికా దేశమైన ఘనాలో ఎన్‌జీఐసీ అనుమతులు తీసుకుంది. ఈ కంపెనీకి రిలయన్స్‌కు చెందిన ర్యాడిసిస్‌ కావాల్సిన పరికరాలను అందించనుంది.

Published : 27 May 2024 13:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత టెలికాం మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో (Reliance Jio).. ఆఫ్రికాకూ విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఘనాకు చెందిన నెక్ట్స్‌-జెన్‌ ఇన్‌ఫ్రాకోతో (NGIC) చేతులు కలపనుంది. రిలయన్స్‌కు చెందిన ర్యాడిసిస్‌ కార్ప్‌తో ఎన్‌జీఐసీ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఘనాలో 5జీ అమలుకు కావాల్సిన మౌలిక వసతలను ఎన్‌జీఐసీ ఏర్పాటు చేయనుంది. అందుకు అవసరమయ్యే పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు, అప్లికేషన్లను ర్యాడిసిస్‌ సమకూర్చనున్నట్లు ఎన్‌జీఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెల్లడించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది.

భారత్‌లో జియో (Jio) అనుసరించిన వ్యూహాన్నే ఘనాలో అమలు చేయాలని ఎన్‌జీఐసీ భావిస్తున్నట్లు సమాచారం. 2016లో వచ్చిన జియో.. స్వల్ప కాలంలో భారత్‌లో అగ్రగామి టెలికాం ప్రొవైడర్‌గా అవతరించింది. ఉచిత వాయిస్‌ కాలింగ్‌, తక్కువ ధరకే డేటా వంటి మార్కెటింగ్‌ వ్యూహాలతో ప్రత్యర్థి సంస్థలకు చెక్‌ పెట్టింది. పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్‌, ఐడియా విలీనమయ్యాయి. ప్రస్తుతం దాదాపు 47 కోట్ల సబ్‌స్క్రైబర్లతో జియో తొలిస్థానంలో ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ఐ‌డియా తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.

5 నిమిషాల ముందూ ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.. ఈ ఆప్షన్‌ గురించి తెలుసా?

2024 చివరి నాటికి ఘనాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎన్‌జీఐసీ (NGIC) సన్నాహాలు చేసుకుంటోంది. ధర విషయంలో ఇప్పటి వరకు తమ వ్యూహాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, ఆ దేశ సమాచార శాఖ మంత్రి మాత్రం అందుబాటు ధరలోనే ఎన్‌జీఐసీ టెలికాం సేవలను అందిస్తుందని ప్రకటించారు. తక్కువ ధరలతో భారత్‌ సాధించిన మొబైల్‌ డేటా విప్లవాన్ని అనుసరిస్తామని తెలిపారు. ఆ దేశంలో వచ్చే పదేళ్ల పాటు 5జీ సేవలను అందించేందుకు ఎన్‌జీఐసీ అనుమతులు పొందింది. దీనికి ఎంటీఎన్‌ ఘనా, వొడాఫోన్‌ ఘనా, ఎయిర్‌టెల్‌టిగో నుంచి పోటీ ఎదురవనుంది.

ప్రస్తుతానికి ఎన్‌జీఐసీలో రిలయన్స్‌కు (Reliance) ఎలాంటి ఈక్విటీ వాటాలు లేవు. ఆఫ్రికాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న అసెండ్‌ డిజిటల్‌ సొల్యూషన్స్‌, కె-నెట్‌ కంపెనీలు ప్రధాన ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. వీటికి 55 శాతం వాటా ఉంది. ఘనా ప్రభుత్వానికి 10 శాతం వాటాలున్నాయి. భవిష్యత్తులో ఈక్విటీ వాటా తీసుకునే అవకాశం రిలయన్స్‌కు కల్పిస్తామని ఎన్‌జీఐసీ ప్రతినిధి తెలిపారు. అంతకంటే ముందు వారి పెట్టుబడులకు తాము విలువ చేకూర్చగలమనే నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని