ఛార్‌ధామ్‌లో జియో 5జీ సేవలు.. ఎయిర్‌టెల్‌ కొత్త మైలురాయి

Bharti Airtel, Reliance Jio: ప్రముఖ టెలికాం కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో 5జీ నెట్‌వర్క్‌ విషయంలో పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా సేవలను వేగంగా విస్తరిస్తున్నాయి.

Published : 27 Apr 2023 20:23 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ 5జీ విషయంలో పోటీపడుతున్నాయి. దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా రిలయన్స్ జియో (Reliance Jio) ఛార్‌ధామ్‌ ఆలయాల్లో తన 5జీ సేవలను అందుబాటులోకి తేగా.. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) దేశవ్యాప్తంగా 3 వేల నగరాలు/ పట్టణాలకు తన 5జీ ప్లస్ నెట్‌వర్క్‌ను విస్తరించి కొత్త మైలురాయిని అందుకుంది. 

దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాల్లో తన 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చిన రిలయన్స్‌ జియో.. ఆధ్యాత్మిక, దర్శనీయ స్థలాలైన ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్‌ ఆలయాల్లోనూ 5జీ సేవలను ప్రారంభించింది. కేదార్‌నాథ్‌, బద్రీనాధ్‌, యమునోత్రి, గంగోత్రి ఆలయ ప్రాంగణాల్లో ట్రూ 5జీ సేవలను ఇకపై వినియోగించుకోవచ్చని తెలిపింది. దేశంలో ఇప్పటికే 3,089 నగరాలు, పట్టణాలకు తమ 5జీ సేవలను విస్తరించామని తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు తమ నెట్‌వర్క్‌ సేవలను తీసుకురానున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. జియో ట్రూ-5జీ (True 5G) వెల్‌కమ్‌ ఆఫర్‌లో భాగంగా యూజర్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్‌ వేగంతో అపరమిత డేటా పొందొచ్చని పేర్కొంది.

5జీ సేవలను అందించడంలో రిలయన్స్‌ జియోతో పోటీపడుతున్న ఎయిర్‌టెల్‌.. వేగంగా తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 3 వేల నగరాలు, పట్టణాల్లో 5జీ ప్లస్‌ (Airtel 5G Plus) నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చామని ఎయిర్‌టెల్‌ తెలిపింది. 2023 సెప్టెంబరులోగా ప్రతి ఎయిర్‌టెల్‌ వినియోగదారుడికి 5జీ సేవలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే రోజుకు 30-40 నగరాలు/పట్టణాలకు తన 5జీ సేవలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని