Zomato: ‘తప్పులు వెతకొద్దు.. ఛాన్స్‌ ఇవ్వండి’: విమర్శల వేళ జొమాటోకు మద్దతు

ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌పై విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు రికీ కెజ్‌.. జొమాటో (Zomato)కు మద్దతుగా మాట్లాడారు. 

Updated : 20 Mar 2024 17:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శాకాహారం మాత్రమే కోరుకునే వారికోసం ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ (Pure Veg Fleet)ను ప్రారంభిస్తున్నట్లు జొమాటో (Zomato) వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే డెలివరీ బాయ్స్‌ యూనిఫామ్‌ రంగు విషయంలో విమర్శలు రావడంతో ఎరుపు రంగు యూనిఫామ్‌నే కొనసాగిస్తామని సంస్థ ప్రకటించింది. అయితే దీనిపై తాజాగా గ్రామీ అవార్డు విజేత రికీ కెజ్‌ స్పందించారు. ఈ కొత్త సేవలు ఎవరినీ బాధించవని అన్నారు. ఈమేరకు ఎక్స్‌ (గతంలో ట్విటర్) వేదికగా స్పందించారు.

‘ఈ కొత్త సేవల్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఒక శాఖాహారిగా నేను ఆర్డర్ చేసిన ఆహారం స్థానంలో మాంసాహారం వచ్చిన సందర్భాలున్నాయి. ఆర్డర్ తీసుకున్న ప్రతిసారీ దానిని జాగ్రత్తగా గమనించాల్సి వస్తుంటుంది. నా జీవనశైలి పరంగానే కాకుండా పర్యావరణ స్థిరీకరణ వంటి కారణాల వల్ల ఈ కొత్త సదుపాయం ఉండటం బాగుంటుందని నేను భావిస్తున్నాను. దీనిని అతిగా తీసుకోవద్దని విమర్శకులను కోరుతున్నాను. నిజానికి ఇది ఎవరినీ బాధించదు. తప్పులు వెతికే బదులు.. ఒక అవకాశం ఇద్దాం. ఇది చాలామందికి అవసరం అని గుర్తించండి’ అంటూ జొమాటోకు మద్దతుగా నిలిచారు.

జొమాటో కీలక ప్రకటన.. వెజ్‌ ఆర్డర్లూ ఎర్ర రంగు యూనిఫామ్‌లోనే..!

శాకాహారమే కోరుకునే వినియోగదారుల కోసం ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ (Zomato Pure Veg Fleet) పేరుతో ప్రత్యేక సేవలను ప్రారంభిస్తున్నట్లు గోయల్‌ మంగళవారం మధ్యాహ్నం ప్రకటించారు. శాకాహారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఈ సేవను తీసుకొస్తున్నట్లు తెలిపారు. కేవలం శాకాహారమే అందించే రెస్టారంట్ల ఎంపిక, నాన్‌-వెజ్‌ ఆహారాన్ని మినహాయించడం వంటివి ఫ్యూర్‌ వెజ్‌ మోడ్‌లో ఉంటాయన్నారు. డెలివరీల కోసం ఆకపచ్చ రంగు డబ్బాలు, యూనిఫామ్‌లు వినియోగిస్తామని చెప్పడంతో ఆన్‌లైన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని