Rooftop solar: 2023 రూఫ్‌టాప్‌ సోలార్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం 6.25% వృద్ధి

Rooftop solar: ఇళ్ల పైకప్పులపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు సామర్థ్యం 2022లో 1.6 గిగావాట్లు పెరగ్గా.. అది 2023లో 1.7 గిగావాట్లకు చేరింది.

Published : 03 Mar 2024 19:15 IST

Rooftop solar | దిల్లీ: ఇళ్ల పైకప్పులపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాల (Rooftop solar capacity) ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు సామర్థ్యం 2023లో 6.25 శాతం (1.7 గిగావాట్లు) పెరిగిందని ఓ ప్రముఖ నివేదిక వెల్లడించింది. 2022లో ఇది 1.6 గిగావాట్లుగా ఉందని తెలిపింది. అక్టోబరు - డిసెంబరు త్రైమాసికంలో రూఫ్‌టాప్‌ సోలార్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం 406 మెగావాట్లు పెరిగిందని అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ మెర్కామ్ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15.9 శాతం తగ్గడం గమనార్హం. మొత్తంగా డిసెంబరు నాటికి రూఫ్‌టాప్‌ సోలార్‌ సామర్థ్యం 10.5 గిగావాట్లకు చేరింది.

2023లో పెరిగిన రూఫ్‌టాప్‌ సోలార్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యంలో గృహాలు, గృహ సముదాయాల వాటానే అధికమని నివేదిక వెల్లడించింది. ఇన్‌స్టలేషన్‌ ఛార్జీలు తగ్గడం, విద్యుత్‌ బిల్లులు పెరగడమే అందుకు కారణమని తెలిపింది. అదే సమయంలో కమర్షియల్‌, ఇండస్ట్రియల్‌ కన్జ్యూమర్ల విభాగంలో వృద్ధి మోస్తరుగా నమోదైనట్లు తెలిపింది. ఛార్జీలు తగ్గుతాయనే ఆశతో వారు వేచి చూస్తున్నారని పేర్కొంది. 2023లో 1.2 గిగావాట్ల రూఫ్‌టాప్‌ సోలార్‌ టెండర్లు జారీ చేసినట్లు తెలిపింది. వార్షిక ప్రాతిపదికన 45.7 శాతం తగ్గినట్లు చెప్పింది. మొత్తం టెండర్ల కెపాసిటీలో 44.2 శాతం ఉత్తర్‌ప్రదేశ్‌ న్యూ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీయే దక్కించుకున్నట్లు పేర్కొంది.

‘సూర్యఘర్‌’కు దరఖాస్తు ఎలా? ₹78 వేల రాయితీ ఎలా పొందాలి?

మొత్తం టెండర్ల సామర్థ్యంలో దాదాపు 57 శాతం వాటా ప్రభుత్వ భవనాలపై ఏర్పాటు చేసే రూఫ్‌టాప్ సిస్టమ్‌లదే. ఇన్‌స్టలేషన్‌లో 27.3 శాతం వాటాతో గుజరాత్ అగ్రగామిగా ఉంది. మహారాష్ట్ర, రాజస్థాన్ వరుసగా 13.3 శాతం, 8.1 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. డిసెంబర్ 2023 నాటికి స్థూల రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టలేషన్‌లో టాప్ 10 రాష్ట్రాల వాటానే 77.3 శాతం. ఇళ్ల పైకప్పులపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాల వ్యవస్థ సగటు ధర వరుసగా ఐదో త్రైమాసికంలోనూ దిగిరావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని