Russia Oil: 4 డాలర్లకు పడిపోనున్న రష్యా చమురు డిస్కౌంట్‌..!

భారత్‌కు ఇప్పటి వరకు చౌకగా లభించిన రష్యా చమురులో డిస్కౌంట్‌ మెల్లగా ఆవిరైపోతోంది. దీంతో చమురు ధరలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.  

Updated : 09 Jul 2023 15:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా(Russia) నుంచి చౌకగా భారత్‌(India)కు లభిస్తున్న చమురు ధరల్లో మార్పులు రానున్నాయి. డిస్కౌంట్‌ 4 డాలర్లకు తగ్గిపోనున్నట్లు సమాచారం. మరోవైపు రష్యా ఏర్పాటు చేసిన చమురు రవాణా సంస్థల చార్జీలు మాత్రం ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి. దీంతో దేశీయంగా చమురు ధరలపై ప్రతికూల ప్రభావం పడనుంది.

ప్రస్తుతం పశ్చిమ దేశాల ధరల నియంత్రణ కారణంగా పీపా చమురును రష్యా 60 డాలర్ల కంటే తక్కువ ధరకే భారత్‌కు విక్రయిస్తోంది. కానీ, బాల్టిక్‌, నల్లసముద్రం నుంచి భారత్‌లోని పశ్చిమ తీరానికి దీనిని చేర్చడానికి షిప్పింగ్‌ ఛార్జీలను పీపాకు 11 డాలర్ల నుంచి 19 డాలర్లు వసూలు చేస్తోంది. ఇది మార్కెట్‌ ధర కంటే చాలా అధికం. ఇందుకోసం రష్యా వద్ద ఉన్న 100కుపైగా ట్యాంకర్లలో కొన్నింటిని భారత్‌కు చమురు కోసం తీసుకొన్నారు. వీటికి అధికధరలను వసూలు చేస్తున్నారు.

గతేడాది ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి భారత్‌కు యురల్‌ గ్రేడ్‌ చమురు సరఫరా పెరిగింది. ఈ క్రమంలో ప్రతిపీపా చమురుపై బ్రెంట్‌ క్రూడ్‌తో పోలిస్తే 30 డాలర్లకు పైగా డిస్కౌంట్‌ ఇచ్చింది. కానీ, ఇప్పుడు అది మెల్లగా 4 డాలర్లకు తగ్గించేసింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని పెట్రోల్‌, డీజిల్‌ను తయారు చేస్తున్న అతిపెద్ద బయ్యర్లుగా భారత చమురు సంస్థలు ఎదిగాయి. మరోవైపు చైనాలో విద్యుత్తు వాహనాల వినియోగం పెరగడం, ఆ దేశ కొనుగోళ్లు ఇప్పటికే గరిష్ఠానికి చేరడంతో.. ఆ దేశం నుంచి కొత్త ఆర్డర్లలో పెరుగుదల లేదు. ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు కేవలం 2శాతం మాత్రమే రష్యా చమురు కొనుగోలు చేసిన  దేశీయ రిఫైనరీలు.. ఆ తర్వాత కొనుగోళ్లను 44 శాతానికి పెంచాయి. భారత్‌కు చెందిన ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌-మిత్తల్‌ ఎనర్జీ, రిలయన్స్‌, నయారా ఎనర్జీ వంటి సంస్థలు ఈ చమురు కొనుగోళ్లకు ఒప్పందాలు చేసుకొంటున్నాయి. ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు మొత్తం రష్యా చమురు దిగుమతుల్లో 60శాతం కొనుగోలు చేస్తున్నాయి. ఈ సంస్థలు సమష్టిగా రష్యాతో బేరమాడితే డిస్కౌంట్‌ పెరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. చైనా, ఐరోపా నుంచి చమురు కొనుగోళ్లు పెరిగే అవకాశం లేదు.

జీ-7 దేశాలు రష్యా చమురుపై 60 డాలర్ల ధర నియంత్రణను అమలు చేయడం మొదలుపెట్టాయి. దీంతో ఈ ధర కంటే తక్కువకు చమురును కొనుగోలు చేసిన వారికే పశ్చిమ దేశాల షిప్పింగ్‌, బీమా సేవలు లభించాయి. రష్యా చమురు రవాణాకు ఐరోపా రిజిస్టర్డ్‌ ట్యాంకుల కంటే.. యూఏఈలో రిజిస్టరైన ట్యాంకులను అధికంగా వాడుతోంది. వీటి వినియోగం యుద్ధానికి ముందు 13శాతం ఉంటే.. 2023లో 37శాతానికి చేరింది. మరో వైపు చైనా, హాంకాంగ్‌ నౌకల వినియోగం 12 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని