Samsung: శాంసంగ్‌ S23 వచ్చేసింది.. ప్రీమియం మోడల్‌ ₹1,54,999.. స్పెసిఫికేషన్లు ఇవే..

Samsung galaxy s23 Price and other details: శాంసంగ్‌ నుంచి మరో మూడు ప్రీమియం ఫోన్లు విడుదలయ్యాయి. వీటి ధరలు రూ.74,999 నుంచి ప్రారంభవుతాయి.

Updated : 02 Feb 2023 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ నుంచి ప్రీమియం ఫోన్లు విడుదలయ్యాయి. గెలాక్సీ సిరీస్‌లో ఎస్‌23 లైనప్‌లో మొత్తం మూడు ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీ విడుదల చేసింది. గెలాక్సీ S23 (samsung galaxy s23), గెలాక్సీ S‌23+ (samsung galaxy s23+), గెలాక్సీ S23 అల్ట్రా (samsung galaxy s23 ultra) పేరిట వీటిని తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.74,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 17 నుంచి వీటి విక్రయాలు ఆరంభం కానున్నాయి. అల్ట్రా పేరిట తీసుకొస్తున్న మోడల్‌ అన్నింటి కంటే ప్రీమియం మోడల్‌. దీంట్లో 200 మెగాపిక్సల్‌ కెమెరాను అమర్చారు.

ధరలు ఇలా..

గెలాక్సీ S23 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధరను రూ.74,999గా నిర్ణయించారు. 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధరను రూ.79,999గా పేర్కొన్నారు. గెలాక్సీ S‌23+ మోడల్‌ 8జీబీ+ 256 జీబీ వేరియంట్‌ ధరను రూ.94,999గా కంపెనీ పేర్కొంది. 8జీబీ+ 512జీబీ వేరియంట్‌ ధరను రూ.1,04,999గా నిర్ణయించింది. ఇక అన్నింటికంటే కాస్ట్‌లీ మోడల్‌ గెలాక్సీ S23 అల్ట్రా. ఇందులో మొత్తం మూడు వేరియంట్లు తీసుకొచ్చారు. ఈ మోడల్‌ 12జీబీ +256 జీబీ వేరియంట్‌ ధరను రూ.1,24,999గా నిర్ణయించారు. 12జీబీ+ 512 జీబీ వేరియంట్‌ ధరను రూ.1,34,999గా పేర్కొన్నారు. 12జీబీ+1టీబీ వేరియంట్‌ ధరను రూ.1,54,999గా శాంసంగ్‌ పేర్కొంది. 

మూడు మోడళ్ల విక్రయాలూ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పటికే ప్రీ బుకింగ్‌ ఆప్షన్‌ను శాంసంగ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫాంటమ్‌ బ్లాక్‌, క్రీమ్‌, గ్రీన్‌, లావెండర్‌ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యమవుతాయి. గెలాక్సీ ఎస్‌ 23 అల్ట్రా అదనంగా రెడ్‌, గ్రాఫైట్‌, లైమ్‌, స్కైబ్లూ రంగుల్లో దొరుకుతుంది. ఇవి కేవలం శాంసంగ్‌ వెబ్‌సైట్‌లోనే లభిస్తాయి. గెలాక్సీ ఎస్‌23 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లోనే తయారు చేయనున్నట్లు శాంసంగ్‌ ప్రకటించింది. స్థానిక మార్కెట్‌ అవసరాలకు తీర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం గెలాక్సీ ఎస్‌ సిరీస్‌ ఫోన్లు వియత్నాంలోని శాంసంగ్‌ తయారీ కేంద్రంలో ఉత్పత్తి అవుతున్నాయి. అక్కడి నుంచి భారత్‌కు దిగుమతి చేస్తున్నారు. 

స్పెసిఫికేషన్లు..

  • గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13తో కూడిన వన్‌యూఐ 5.1తో వస్తోంది. ఇందులో 6.1 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే, డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో డిస్‌ప్లే అమర్చారు. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్ ‌2 ప్రాసెసర్‌ను వినియోగించారు. వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, 12 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 10 ఎంపీ టెలీఫోటో కెమెరాను అమర్చారు. ముందు వైపు 12 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5జీ, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, ఐపీ68 రేటింగ్‌ కలిగిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ అందిస్తున్నారు. 3900 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25W వైర్డ్‌ ఛార్జింగ్‌కు, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 
  • గెలాక్సీ S23+ సైతం ఆండ్రాయిడ్‌ 13తో కూడిన వన్‌యూఐ 5.1తో వస్తోంది. 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 ప్రాసెసర్‌ను అమర్చారు. ఎస్‌23లో ఉన్న మూడు కెమెరాలనే ఇందులోనూ వినియోగించారు. బ్యాటరీ విషయానికొస్తే 4,700 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. 45W వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తోపాటు రివర్స్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఇందులో ఉంది.
  • గెలాక్సీ S23 అల్ట్రా కూడా ఆండ్రాయిడ్‌ 13తో కూడిన వన్‌యూఐ 5.1 తో వస్తోంది. 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ డైనమిక్‌ అమోలెడ్‌ 2 ఎక్స్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 120Hz రీఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 ప్రాసెసర్‌ వినియోగించారు. ఇందులో 200 ప్రధాన కెమెరా అన్నింటి కంటే హైలైట్‌. దీంతో పాటు 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ లెన్స్‌, 10 ఎంపీ టెలీఫోటో లెన్స్‌ను వినియోగించారు. ముందు వైపు 12 ఎంపీ సెన్సర్‌ను వాడారు. ఇందులో ఎస్‌-పెన్‌ సదుపాయం ఇస్తున్నారు. స్టైలస్‌ను ఫోన్‌తో పాటే ఇస్తున్నారు. ఐపీ68 రేటింగ్‌ కలిగిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 45W వైర్డ్‌ ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. రివర్స్‌ ఛార్జింగ్‌ కూడా ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని