SBI నుంచి గ్రీన్‌ రూపీ టర్మ్‌ డిపాజిట్‌ స్కీమ్‌.. వడ్డీ ఎంతంటే?

SBI term deposit scheme: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త టర్మ్‌ డిపాజిట్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఏమిటీ డిపాజిట్‌? వడ్డీ రేటు ఎంత? వంటి వివరాలపై ఓ లుక్కేయండి.

Published : 12 Jan 2024 21:34 IST

SBI Green Rupee Term Deposit | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కొత్త టర్మ్‌ డిపాజిట్‌ను శుక్రవారం లాంచ్‌ చేసింది. ఎస్‌బీఐ గ్రీన్‌ రూపీ టర్మ్‌ డిపాజిట్ (SGRTD) పేరిట దీన్ని తీసుకొచ్చింది. పర్యావరణానికి అనుకూలంగా ఉండే కంపెనీలకు పెట్టుబడులు సమకూర్చే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చినట్లు బ్యాంక్‌ తెలిపింది.

అసలేంటీ గ్రీన్‌ డిపాజిట్‌..?

సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లాంటిదే ఈ గ్రీన్‌ డిపాజిట్‌. ఈ పథకంలో డిపాజిట్‌ చేసే మొత్తాన్ని పర్యావరణ అనుకూల ప్రాజెక్టులు, కార్యకాలపాల్లో మాత్రమే పెట్టుబడి పెడతారు. అంటే ఇంధన సామర్థ్యం పెంపు, పునరుత్పాదక శక్తి, హరిత రవాణా, ఆహారం, వ్యవసాయం, అడవులు, వ్యర్థాల నిర్వహణ, కర్బన ఉద్గారాల తగ్గింపు, హరిత భవనాలు ఇలా పర్యావరణానికి మేలు చేసే రంగాలకు కేటాయిస్తారు. 2070 నాటికి శూన్య ఉద్గారాల లక్ష్యాన్ని సాధించాలన్న ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా అడుగులు వేయటంలో ఈ తరహా డిపాజిట్లు ఉపయోగపడతాయని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా ఈ స్కీమ్ లాంచ్‌ సందర్భంగా పేర్కొన్నారు.

రిలయన్స్‌లో ఉద్యోగాలు.. బీటెక్‌ విద్యార్థులకు సదవకాశం

అర్హులెవరంటే..?

భారతీయ నివాసితులు, సంస్థలు, ఎన్నారైలు ఈ స్కీమ్‌కు అర్హులు. ఈ టర్మ్‌ డిపాజిట్‌పై ముందస్తు ఉపసంహరణ, లోన్‌ సదుపాయం కూడా ఉంది. 1111 రోజులు, 1777 రోజులు, 2222 రోజుల కాలపరిమితులపై టర్మ్‌ డిపాజిట్ అందుబాటులో ఉంది. బ్యాంకు శాఖకు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు. త్వరలో యోనో (YONO), ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ ద్వారా కూడా అందుబాటులో రానుంది. ఈ టర్మ్‌ డిపాజిట్లపై సాధారణ కార్డ్‌ రేటు కంటే 10 బేసిస్‌ పాయింట్ల తక్కువ వడ్డీ రేటు ఉంటుందని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

వడ్డీ రేట్లు ఇలా..

1111 రోజుల కాలపరిమితి కలిగిన రిటైల్‌ డిపాజిట్లపై 6.65 శాతం వడ్డీ లభిస్తుంది. 1777 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 6.65 శాతం, 2222 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 6.40 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. 1111, 1777 రోజుల బల్క్‌ డిపాజిట్లపై 6.15 శాతం, 2222 రోజుల కాలపరిమితి కలిగిన బల్క్‌ డిపాజిట్లపై 5.90 శాతం వడ్డీ చెల్లిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని